30, అక్టోబర్ 2016, ఆదివారం

ఎలక్షణాలు

మూడు తరాలనుండి మోస్తూ ఉన్న మ్యానిఫాస్టో
కొత్త ప్రింట్ అవుట్ తీసి ముందు పెట్టాము
మరో సారి అరచేతిలో చూసుకొని 
క్షణకాలం స్వర్గంలో తేలి పోండి .
మా తాతల కాలంలో ఇచ్చిన హామీలు
చార్మినార్ రేకుల సాక్షిగా
తీరుస్తామని సరికొత్తగా
మరోసారి హామీ ఇస్తున్నాం.
మా తాతలు వేసిన మూడు రంగులు
వెలిసిపోకుండా మా మూతులకు
పూసుకొని తిరుగుతున్నాం ,
వాసన చూసి ఓటేసి వెళ్లండి .
అభివృద్ది అంటాం , అబ్ కీ బార్
అంటాం, వృద్దులను పక్కన పెడతాం
మోడలో. . మోడులో తెలియదు కానీ
మెడలో వేసుకొని తిరుగుతున్నాం .
భారమో.. భార..తీయమో ,
బరువు మాత్రం మోయమంటున్నాం
తలపై మోది, ఆధ్వని రాకుండా, రోదన లేకుండా
మిమ్మలనందరిని ,అందలం ఎక్కిస్తామని
కర్ణాలలో పంకజాలు పదిలంగా దాస్తున్నాం
వాసన చూసి ఒట్లేసి వెళ్లండి

నమ్మకాలు

నాకు తెలుసు నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని !!
ప్రతిదానికి ఋజువులు కావాలంటే ఎలా !!
భౌతిక అనుభూతులకు అందని
మానసికానుభూతులు అలా తెలుస్తూనే ఉంటాయి
ఇప్పుడు ఇది ఇలా అనే సిద్దాంతీకరణ చెయ్యలేను
అది అంతా మాయే అనే వేదాంతీకరణ చెయ్యలేను
ఉన్నదున్నట్లు అనుభవించటం తప్ప
తర్క మీమాంసలకు తావెందుకు ??
ఎలా సూత్రీకరించాలా అనే అలోచనెందుకు ??
చెరువులో చేపపిల్ల ఈదిన జాడలు కనిపిస్తాయా !!
నీతో పాటే నడిచే నీడ అడుగులెక్కడో తెలుస్తాయా !!
సరుగుడు చెట్ల మధ్య గాలి ధ్వని విని
అది ద్వంసగీతం అనుకుంటామా !!
దూకే జలపాతాల హోరు విని
అది ఉత్సాహం అనుకోగలమా !!!
ఎప్పటికయ్యది అప్పటికి అనుకుంటూనే
కాలం, దాన్నంటే జీవితం సాగుతుంటాయి
ఏవి కంటికి కనిపించవు, వినిపించవు
అయినా నీకు తెలుస్తూనే ఉంటుంది
నువ్వు ప్రతిస్పందిస్తూనే ఉంటావు
అసలు అన్నీ తెలుసుకున్నాక ఇంకా ఈ ఋజువుల భాషెందుకు ??
మనసులో ఉన్న భావనలకు మనుషుల సాక్ష్యాలెందుకు??
ప్రవాహాల్లో ఎక్కడైనా పాతనీరు చూడగలమా
వీచేగాలిలో ఎప్పుడైనా పురాగంధాన్ని ఆస్వాదించగలమా !!
కాలం ఎప్పుడూ నిత్యనూతనమే !
ప్రతిక్షణాన్ని గతక్షణంతో సంధానిస్తూ
భవిష్యత్తులోకి సాగిపోవాల్సిందే కదా !!
నువ్వైనా, నేనైనా ఈ సంధికాలాని కట్టుబడ్డ
గడ్డిపోచలమే కదా !!
ఉన్నది ఉన్నట్లుగా అనందిద్దాం
లేనిది లేనట్లుగా వదిలేద్దాం
నిజాన్ని నమ్మనంతవరకు అబద్దమే
అబద్దం నమ్మినంతవరకు నిజమే
నిజానిజాలు చూసే కోణాలను బట్టి మారుతూనే ఉంటాయి
నమ్మకాలు ముఖ్యంకానీ, నిజాలు కానే కాదు.
ఎప్పుడైనా సత్యాసత్యాలు క్షణికాలు
నమ్మకాలు మాత్రమే శాశ్వతాలు.
నమ్మాల్సింది మనసునే కానీ
మనుషులను కాదు.

3, అక్టోబర్ 2016, సోమవారం

ఝీలం కా ఆలం

ఝీలం నది ఎప్పటిలాగే పారుతూ ఉంది
చీనార్ చెట్లను ఒరుసుకుంటూ….
ఆ చెట్ల చివరన ఎగురుతున్న జెండాలను చూసుకుంటూ….
మౌనంగా, ఉధృతంగా, ప్రవాహంగా ,
తర తరాలుగా పారుతూనే ఉంది
దాని లక్షణం పయనించటమే
ముందుకు వెళ్ళటమే
రెండు ఒడ్లనే కాదు,
రెండు దేశాలను కలుపుతూ
స్వేచ్చగా ,విహంగంలా
పయనిస్తూనే ఉంది.
మేరా ఝీలమ్ !!
వహా కౌన్ హై…… తేరా ముసాఫిర్
********
బలవంతంగా పయనాన్ని ఆపి
నీటికి ఒకటే ఒడ్డని తీర్మానించాక
ఏ ఒడ్డుకు చేరాలో తెలియక దుఃఖిస్తున్న
గుల్ మార్గ్ కన్నీళ్ళు కలిసి
స్వచ్చమైన ఝీలం నీళ్ళన్నీ
గడ్డకట్టి బిగుసుకుపోయాయి
ఊపిరందని నీటి పక్కన నిలుచున్న
చీనార్ చెట్లు కూడా
ఒక్కొక్కటిగా కూలుతున్నాయి
చెట్లతో పాటే పాతిన జెండాలూ.
ఎవరి ఒడ్డు కోసం వాళ్ళు యుద్దం చేసుకుంటుంటే
నది భయంతో తన ప్రవాహం మరిచిపోయింది
ఝీలమ్,…..ఝీలమ్…. డూండ్ తేరా కినరా
*********
లాల్ చౌక్ నుండి లాల్ ఖిల్లా
రోజు రొజు కీ దూరం జరుగుతోంది
కారణం తెలియని ఖిలాన్ మార్గ్
ఎటు వెళ్లాలో దిక్కుతోచక నిలబడుంది
పచ్చటి కాశ్మీరమంతా ఎక్కడ చూసినా
* బిచ్చూ బూటీ లే నేలంతా పరుచుకుంటున్నాయి
వళ్ళంతా గాయాలు చేస్తున్నాయి
కట్రామీదుగా వీచే గాలులన్నీ కుట్రలేనని
హారా రంగ్ మాయ చేస్తుంది
బందీపురా పైనుండి కురిసే బుల్లెట్లకు మందు
హిమాలయాలకు కాషాయపు రంగులద్దటమే
అని డిల్లీ షెహన్షా నమ్మబలుకుతున్నాడు
ప్రవాహం మరిచిన ఝీలం
ఒడ్డుకోసం ఎదురు చూస్తుంది
అరే మేరీ సజనోం !!
ఝీలంకా ఆలం సంఝా కరో…………
* బిచ్చూ బూటీ = కాశ్మీర్ లో పెరిగే ఒకరకమైన విషపు మొక్క.