30, ఏప్రిల్ 2013, మంగళవారం

నేడేమేడే


కార్మికుల పండగ, కర్షకుల పండగ
కార్మికుల కొత్త పేరు కార్పోరేటు ఎంప్లాయి
బ్లూ కాలర్ నుండి వైట్ కాలర్ వరకు రూపం మార్చుకొంది
రూపం మారింది కాని దాని గుణం మారలేదు
పాతరోజులే నయం ,కనీసం పోరాటమైనా చేసేది
ఇప్పుడు ఆరాట పడుతుందే  తప్ప పోరాటం మర్చిపోయింది
బ్లూ కాలర్ ఉన్నప్పుడు కనీసం హక్కులైనా ఉండేయి
వైట్ కాలర్ కి మారాక పింక్ స్లిప్ లే మిగిలాయి
కార్మికుడి కి  టార్గెట్స్ తో పాటు టైమింగ్స్ కూడా ఉండేవి
కార్పోరేటు ఎంప్లాయి కదా టైమింగ్స్ లేవు , స్ట్రెస్స్ ఫుల్ నెస్ తప్ప
ఓటి లైనా దొరికెయేమో ఆ  లైసెన్స్ రాజ్యంలో
టీ నీళ్ళు కూడా దొరకవు ఏ సైలెన్స్ రాజ్యంలో
ఇంటికి  మూరెడు మల్లెపూలు తీసుకెళ్ళెవాడు ఫాక్టరీ నుంచి వెళ్తూ
ఇక్కడ గుప్పెడు మందు బిళ్ళలు తీసుకెలుతున్నాడు కంపెనీ నుండి వెళ్తూ
వీరి కోసం నినదించే గొంతులు లేవు, వీరికి  గొంతులు పెగలవు

ఉద్యమాలు లేవు, ఉరకలెత్తే ఉత్సాహాలు లేవు
వీరికి మేడేలు లేవు, , రావు, 





28, ఏప్రిల్ 2013, ఆదివారం

అపరిచితులం

మనిద్దరం అపరిచితులమే,
ఆ క్షణానికి ముందు.
కలలో కూడా నేను
కలగనలేదే,
నీ తో పరిచయాన్ని.
ఎప్పుడు ఎవ్వరు అనలేదే,
నేను నిన్ను కనుగొంటానని.
ఊహించనే లేదే,
నా హృదయాన్నిలా  బంధిస్తావని
నన్ను నేను మర్చిపోయి బ్రతుకీడుస్తున్నపుడు
నువ్వు నాకు నన్ను గుర్తు చేశావు,
అదేనా మన పరిచయారంభం
నా జీవన రహదారిలో నా ఒంటరి ప్రయాణం  చేస్తున్నా
నీ ప్రేమ నదిని నాకడ్డుగా ప్రవహింప చెశావు
అప్పటి నా గతుకుల ప్రయాణం ,
నీ సాంగత్యంతో అలల పై హాయిగా తేలుతుంది
ప్రపంచానికి  దూరమై ఏకాకి గాలి పటాన్నై ఎగురుతున్నా
నన్ను పట్టి తెచ్చి మన ప్రేమ నావకు తెరచాప  ను చేశావు
చుక్కానివి  నువ్వయ్యావు , ఒడ్డుకు చేర్చావు.
ప్రియా ! నేను వెతుకుతున్న  ప్రపంచం ఇదేకదా
ఇదిగో  ఇప్పుడు చెప్తున్నా
నీ కెప్పటికి కన్నీళ్ళు తెప్పించను
మన ఇద్దరం కలిసి నడుద్దాం
ఇద్దరం కలిసి ప్రేమ అలల పై తేలుదాం
ఎప్పటికీ, ఇంకెప్పటికీ ,  నేను నా శ్వాస
తీసుకోలేనంత అశక్తుడినయ్యేదాకా

రైతు బ్రతుకు

రైతన్నకి పెద్దగా
పని లో తేడా రాలేదు, కాకపోతే హోదాలో
అప్పుడు కళ్లం దగ్గర కాపలా
ఇప్పుడు గుమ్మం దగ్గర కాపలా
అప్పుడు ఇంటికొచ్చిన వారికి మర్యాదలు ఇంటాయన హోదాలో
ఇప్పుడు ఆఫీసుకొచ్చిన వారికి మర్యాదలు పనాయన హోదాలొ
అప్పుడు పైరు కొయ్యటానికి వంగాడు
ఇప్పుడూ జీతం తీసుకొవటానికి వంగాడు
అప్పుడు కట్టింది మాసిన పంచయినా మర్యాదే
ఇప్పుడు కట్టింది ఇస్త్రీ చేసిన ప్యాంటయినా అమర్యాదే
అప్పుడు పేరు మోతుబరి
ఇప్పటి పేరు సెక్యూరిటి
అప్పటి ముఖంలో సంతోషం
ఇప్పటి ముఖంలో నైరాశ్యం
ముఖం మారలేదు కాని ముఖ చిత్రం మారిపోయింది
కొత్త కొత్త సెజ్ ల పాదాల కింద పాపం పంట నలిగిపోయింది
వ్యవసాయం తప్ప సాయం ఆడగని చేతులు
చేష్టలుడిగి చూస్తున్నాయి
ఇది ఆధునిక రైతు బ్రతుకు చిత్రం
అన్నం పండించే రైతుకే అన్నం లేకపోవటం మహా చిత్రం

27, ఏప్రిల్ 2013, శనివారం

చెట్టు కథ

మా ఊరి చెట్లు
------------మా నాన్న గారి ఉద్యోగ రీత్యా, బదిలీ అయి మా ఊరు "అమ్మనబ్రోలు" కి వచ్చినప్పుడు నాకు 10 ఏళ్ళు, అదేంటో రైలు దిగగానే నాకు ఊరు భలే నచ్చేసింది, స్టేషన్ లోనే ఎర్రటి తివాచీ పరిచినట్లు పరుచుకున్న సిర్పేటు చెట్లు, స్టేషన్ బయట చల్లటి వేప చెట్టు, దాని కింద కిరోసిన్ స్టవ్ కి గాలి కొడుతూ కాలేషా టీ కొట్టు, దాని వెనకంతా కనుచూపు మేరలో పచ్చటి పచ్చిక, అప్పుడే వాన పడి వెలిసిందేమో, మరింత పచ్చగా కనిపిస్తుంది, టీ కొట్టు దాటి కొద్దిగా ముందుకు రాగానే, కుడి వైపు, వరసగా గుర్రబ్బళ్ళు, అప్పటి దాకా అప్పుడప్పుడు ఎద్దుల బళ్ళు ఎక్కానే తప్ప, గుర్రబ్బండి ఎప్పుడూ ఎక్కక పోవటం వల్లేమో, అది చూడగానే నాలో ఏదో ఉత్సాహం , గుర్రం కన్నా వేగంగా బండి దగ్గరకు పరుగు పెట్టించింది, ఊరు అక్కడనుండి దాదాపు 2 మైళ్ళు దూరం, అప్పటికే మా సామాను అంకమ్మ బండి లో పెట్టించేశాడు, మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన లింగారావు మాష్టారు, గుర్రం కదా పరుగెత్తుతుందేమో అనుకున్నా, పాపం ఒక్కరైతే ఎలా ఉండేదో, ఐదుగురం కదా అది కూడా నడకే ప్రారంభించింది, అలా అక్కడ్నుండి రోడ్దెక్కామో లేదో, ఎటు చూసినా పచ్చికే, ఎర్రనేల కదా, ఇంకా పచ్చగా కనిపిస్తుంది, కొద్ది గా ముందుకు రాగానే, ముందుగా యానాది కాలనీ, అది దాటి కొంచెం ముందుకు రాగానే రైల్వేగేటు, ఏదో గూడ్స్ బండి వస్తున్నట్లుంది, గేటేశారు. అటు ఇటు మఱి చెట్లు, వాటి కింద బఠానీలు, వేరుశెనగ పప్పులు, అమ్మే వారు, గంపల్లో తేగలు, మామిడి తాండ్ర, కలిసి కలర్ ఫుల్ గా కన్పిస్తుంది, గేటు దాటి ముందుకెళ్ళగానే స్కూలు,, అంతకుముందు నేను చదివిన స్కూలు కన్నా చాలా పెద్దది, పెద్ద ఆటస్థలం, ఉత్సాహంగా రేపటినుండి నేను వెళ్ళాల్సిన స్కూలు ను చూసుకుంటూ ముందుకెళ్తున్నాను, స్కూలు దాటగానే, రెసిడెన్షియల్ స్కూలు, ప్రాంగణం అంతా రంగు రంగుల పూల మొక్కలు, అమ్మాయల రెసిడెన్షియల్ స్కూలు కదా, పూలు బాగా పెంచినట్లున్నారు, పాత ఇనస్పెక్షన్ బంగళాను రెసిడెన్షియల్ స్కూలు గా మార్చారట, పూల తోట మధ్యలో ఠీవిగా కనిపిస్తుంది, అది దాటి కొద్ది ముందుకు వెళ్ళగానే, హాస్పిటల్. హాస్పిటల్ ముందంతా, అత్తి చెట్లు( మేడి పండు) , వెలక్కాయ చెట్లు, ఆ చెట్లు చూడగానే వేమన పద్యం గుర్తువచ్చింది "మేడి పండు చూడ మేలిమై ఉండు" , వెలగ చెట్లు చూడగానే ఏనుగులు గుర్తు వచ్చాయి " కరి మింగిన వెలగ పండు" అంటారు కదా . ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎడమ వైపు సినిమ హాలు, దాని కెదురుగా మామిడి తోట . దానిక్కొంచెం ముందు పోలేరమ్మ గుడి, అది దాటగానే చెరువు కట్ట మీదకు వచ్చింది గుర్రబ్బండి, చెరువ కట్ట ఎక్కగానే చల్లటి గాలి రివ్వున మొహం మీద కొట్టింది, గట్ట మీదంతా చెట్లే, మర్రి, చింత, రావి, నిద్రగన్నేరు ఒక్కటేమిటి, ప్రతి పది అడుగులకో చెట్టు. అక్కడ కుడి వైపు తిరిగితే ఊరు, ఊర్లొ ఒక పది పదిహేను ఇల్లు దాతాకా, ఒక పెంకుటింటి ముందు ఆగింది . పెద్ద ఇల్లు, ఊరంత పెరడు, ఇంటి ముందు ఒక బొప్పాయి చెట్లు, రెండు కొబ్బరి చెట్లు, పెరడంతా చెట్ల మయమే, ముందుగా బావి, దాన్నుండి నీరు పోయే ఏర్పాటు, మునగ చెట్టు, బాదం చెట్టు, అంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న వారు పెట్టినట్లున్నారు, చిక్కుడు పాదు, పోట్లకాయ పాదు, ఇక అమ్మ కూరగాయల కోసం హడావుడి పడనక్కర్లేదు, పాపం అమ్మకు ఎప్పుడు హాడావుడే, స్కూలు కి పది నిమిషాల ముందే స్కూల్లో ఉండటం అమ్మా, నాన్న అలవాటు, అదేంటి నాన్న అంటే, మాష్టార్లు ఎప్పుడు ముందు వెళ్తేనే పిల్లలు వస్తారు అనేవాడు, ఇక ఆ హడవుడి ఉండదు అనుకుంటా అమ్మకు .
ఆ ఇంత్లో ఆ ఊరితో , అ చెట్లతో దాదాపు 10 సంవత్సరాల అనుబంధం , ఏమి జరిగిందే ఏమో, పంహాయితీ వారికి నిధులు లేవని, చెరువు గట్టు మీద ఉన్న చెట్లు అమ్మకానికి పెట్టారు, చెట్లు కొట్టేశారు, ఎందుకో ఆ ఊరు అప్పటినుండి కళావిహీనంగా , బొట్టు కోల్ఫ్యిన విధవ స్త్రీలా కంపిస్తోంది, అదే సమయంలో మేమున్న ఇళ్ళు వేరే వారికి అమ్మేశారు, మేము ఇళ్ళు ఖాళీ చెయ్యక తప్పలేదు , , అ ఇల్లు చెట్లు కూల్చేసి కొత్త డాబా కట్టారు , చెట్లన్నీ మాయం అయ్యాయి ,ఆ చెట్లతో కూడా ఋణం తీరిపోయిందేమో, ఇక చెట్ల అవసరం రాదు అనుకున్నరెమో
ఇప్పుడు ఊరెల్తాను, స్టేషన్ నుండి ఊరికి దూరం మారలేదు, గుర్రబ్బళ్ళ స్థానంలో ఆటో లు వచ్చాయి, చెట్ల స్థానంలో మాత్రం ఏమి రాలేదు, అలాగే బోసి పోయి ఉన్నాయి, బహుశా ఎప్పటికి రావేమో కూడా

ప్రేమాగ్ని

నా స్నేహమా ! రోజు
నీ ముంగురులను తాకుతూ
గాలి తీసుకువస్తున్న పూల గంధాల ను ఆస్వాదిస్తున్నా
నీ వదనాన్ని తాకుతూ
భానుడు మోసుకొస్తున్న సంధ్య కాంతులు చూస్తున్నా
కానీ ! తెలుసా !
నా ఆలోచనలన్నీ నీ వడిలో నిదురిస్తూ
చల్లటి చందమమ ను చూడాలని
ప్రపంచాన్నంత వదిలేసి
నీ హృదయ స్పందన విందామని
ప్రియా ! నీ వెచ్చని శ్వాస
నన్ను అలా ఆలా కరిగించేస్తోంది
నీ బాహువుల్లో కి చేరుకోమంటుంది
ఇంకా ఎందుకీ నిరీక్షణ
ఇదేనా ప్రేమ వేదన
మన ప్రేమాగ్ని మన మధ్య మంచుతెరలను కరిగిస్తోంది
మనిద్దరం ఇంకా ఇంకా దగ్గరవుతున్నాం
మనిద్దరికి తెలుసు, అయినా ఇంకా మౌనం ఎందుకు
రా మనిద్దరం ఒక్కటై మన ప్రేమ లోకంలో విహరిద్దాం
ఎవరికీ తెలియని రహస్యాలు చేదిద్దాం
మన మధ్య గాలి ని నిషేదిద్దాం
భానుడిని తిరస్కరిద్దాం

26, ఏప్రిల్ 2013, శుక్రవారం

విషాదగీతం

ఎలా పాడగలిగావు ప్రియా
నీది కాని నా ప్రేమ పాటని అంత అర్తిగా
ఎలా నిలవగలిగావు ప్రియా
నీదీ కాని నా కలల లోకంలో ఓ రాణిగా
ఎలా చెప్పగలిగావు ప్రియా
నీది కాని నా ప్రపంచం లో నా ప్రేమని

నా పాట ఎప్పుడూ నాతో చెప్పలేదే
ఇది విషాద గీతం అని
నా కల నాకు ఎప్పుడు నా కనిపించలేదే
పీడకలగా మారుతోందని
నా ప్రపంచం ఎప్పుదు నాతో చెప్పలేదే
నేను సృష్టింఛున్నది శూన్యానని

మరి నువ్వు నాకు దూరమెలా అయ్యావు
నాపాట, నా కల, నా ప్రపంచం నువ్వే కదా ప్రియా
మరి నాకు నువ్వు దూరమైతే నాకు నేను దూరమైనట్లే కదా

25, ఏప్రిల్ 2013, గురువారం

నా మరొకరు

అదుగో అద్దంలో ఇద్దరు కనిపిస్తున్నారు
ఒకరు నేను మరొకరెవరో
అదుగో మరొకరు మింగేస్తున్నారు నన్ను
నేను చచ్చిపోతున్నాను నవ్వుతూ
మరొకరు పెరుగుతున్నాడు బలంతో
మరొకరి మొహం కూడా నవ్వుతూనే ఉంది నాలాగే
చూశాను అతని మనసు కనిపిస్తుంది వికృతంగా
పాము బుసల శబ్దం ,అతను శ్వాస తీసుకుంటున్నాడు
అడవి నక్కల ఊళ, అతను చూస్తున్నాడు
శవాల కపాల మోక్షం, అతను మాట్లాడుతున్నాడు
రక్కసి దెయ్యాల నాట్యం, అతను నడుస్తున్నాడు
మనిషిని పూర్తిగా చంపేశాడు,
అదుగో మళ్ళీ అద్దంలో చూశాను
ఒక్కరే కనిపిస్తున్నారు, అది మరొకరిలా లేదే
ఎవరు అది, ఆ కన్సించేది ఎవరు , నేనా?
నేనేనా...........ఆశ్చర్యం, నేనే
అది నేనే, అవును నేనే
నాలోని మనిషిని చంపింది నేనే
నేనిప్పుడు మనిషి ని కాని నేను

కొత్తదేవుళ్ళు

కొత్త కొత్త దేవుళ్ళు, సరి కొత్త గుళ్ళు
రంగురంగుల గోపురాలు
ఖరీదైన ఆభరణాల మధ్యలో బిక్కు బిక్కుమంటున్న భగవంతుడు
భగవంతుడు కనపడక ఆలయమంతా వెతుకుతున్న భక్తుడు
భగవంతునికి భక్తునికి మధ్య వెలిసిన తెరలు, తొలిగిన బంధాలు
ప్రసాదాల ఖర్చులు, భజన పందిరి హంగులు , హాజరైన జనం లెక్కలు
ఖరీదైన భక్తి కొసం అస్తులమ్మలేక నాస్తికులు అవుతున్న అస్తికులు
అస్తులు పెంచుకుంటున్న భగవంతుని కొత్త ప్రతినిధులు
ప్రతిరోజు వెలుస్తుంది సరికొత్త స్వామిజీ ఆశ్రమం
అదే అన్నిటికన్నా లాభసాటైన వ్యాపారం
భక్తుడిని చేరుకోలేని భగవంతుడు
భగవంతుడిని అందుకోలేని భక్తుడు
ఇదే కదా నేటి భక్తి కి సరైన నిర్వచనం

నీతో కలిసి

ఓ ప్రియా ఏంటి చూస్తున్నావు
రా మనిద్దరం కొద్ది సేపు కలిసి నడుద్దాం
నీ తో  నా నడక  లో తెలుస్తుంది, నా నడక లో  రాజసం
ఆ సమయంలో నేను మహరాజునే , నే చూసేది నీ పాద కుసుమాలనే
ఎందుకంటే అది నీతో కల్సి వేసే  నా అడుగు కదా
నీ నడక వేగం పెరిగినా తగ్గినా, నా పాదమూ  అదే చేస్తుంది, నాక్కూడా తెలియకుండా
ఆందుకే ఆ నడక జీవితాంతం నడవాలని ఉంది నీతో కలిసి
ఓ ప్రియా రా మనిద్దరం కలిసి జీవిద్దాం
నీతో నా జీవనం లో తెలుస్తుంది , నా జీవితంలో ఆనందం
ఆ సమయంలో నేను ఆనంద విహారినే,, నే చూసేది నీ నవ్వు రతనాలనే
ఎందుకంటే అది నీతో కలిసి సాగించే నా జీవనం కదా
నీ జీవితంలో ఆనంద విషాద భావాలు ఏవైనా, నా మనసులొనూ అదే భావనలు, నాకు తెలియకుండా
అందుకే అ జీవనం సాగాలని ఉంది ,మరు జన్మ కు కూడా నీతో కలిసి

24, ఏప్రిల్ 2013, బుధవారం

ఈ క్షణం

నేనీ క్షణాన్ని మరువలేను
నీ నవ్వునీ మరువలేను
నన్ను వదిలి వెళ్తున్నావా ప్రియా
నువ్వు నవ్వుతూనే వీడ్కోలు చెప్తున్నావు కదా
నీ కళ్ళలో ఉన్న దిగులు నే చూడలేదనుకున్నావా
నాకు తెలుసు
నువ్వూ ఈ క్షణాన్ని గుర్తిసావు
నా కన్నీరు అలలా నీ పాదాన్ని తాకుతోంది
మెత్తని నీ పాదాలు పొడి ఇసుక గరుకును తాళలేవు
తిరిగి అలల తీరం చేరుతావు
నీకు తెలుసా
నాకు జీవితమే లేదు,
నా జీవనం లో నీ నవ్వు లేకుంటే
నా ప్రాణాన్ని ముత్యాలు గా మార్చి
నీ దోసిళ్ళలో పోస్తున్నాను,
నాకు తెలుసు
దాన్ని నువ్వు గుండెలకు హత్తుకొంటావని
అ హృదయం కోరుకొంటున్నది అదే అని
అందుకే
నేనీ క్షణాన్ని మరువలేను
నీ నవ్వునీ మరువలేను

23, ఏప్రిల్ 2013, మంగళవారం

ప్రేమదుఃఖం

ప్రతి ప్రేమలో దుఃఖం ఉంది
మన ఇద్దరం కలిసే ఉంటున్నాం 

ప్రతి చీకటి రాత్రి అంతం అయ్యేదాకా,
ఒకరి ఒడిలో ఒకరు పడుకున్నా
తీరని ఎడబాటు దూరాలలో ,
నేనేదో చెప్పాలి, నీవేదో వినాలి
అని ఇద్దరం అనుకుంటూనే ఉన్నాం
మనసులో మౌనంగా , బహుశా
అందుకే ప్రతి ప్రేమలో దుఃఖం ఉంది
ప్రతి ప్రేమికుడు పాడుకొనే విషాద గీతంలా
ప్రతి వెలుగు నంటిపెట్టుకొచ్చే చీకటిలా
నేను వినేది ఎప్పుదూ నీ పాటే
అది నువ్వు గుర్తిస్తే అది వింతే
నువ్వు నా పక్కనే కదా ఉన్నావు
అయినా ఎందుకు అది అంత వింత అయ్యిందొ
నా కర్ధం కాదు, బహుశా
అందుకే ప్రతి ప్రేమలో ఒక దుఃఖం ఉంది
ప్రతి ప్రేమికుడు విషాద గీతం లా

ప్రతి వెలుగునంటి పెట్టుకొచ్చే చీకటిలా

22, ఏప్రిల్ 2013, సోమవారం

సంఘసంస్కర్తలం

మనంతా సంఘ సంస్కర్తలం,
ఫేస్ బుక్ గోడలపై రాతలు రాస్తాం
దాంతో అందరి తల రాతలు మారతయాని తలపోస్తాం
మారాయనకొని తలుపులు మూసేసి మర్చిపోతాం
మారనప్పుడు మారని సమాజాన్ని నిందిస్తాం
మనం మేధావులం
సమాజం పనికి రాదని నిర్ణయిస్తాం
సమాజం చెడిపోతోందని కన్నీరు కారుస్తాం
ఎందుకూ పనికి రాదని నిందిస్తాం
మన మాటలు వినలేదని వదిలేస్తాం
మనం నిజంగా మేధావులం , సంఘ సంస్కర్తలం
గొప్పవాళ్ళం, అందుకే మనం సమాజాన్ని వదిలేద్దాం
మనం ఈ గోడలు దాటి మనం రావటం కష్టం
వస్తే మనల్ని ప్రశ్నిస్తుంది ఈ బుద్ది లేని సమాజం
ఆ ప్రశ్నకు మన దగ్గరఉండదు సమాధానం
అయినా మనల్ని ప్రశ్నిస్తుందా ఈ పాడులోకం
అందుకే అంటున్నాను మనం మేధావులం
మనకొద్దీ సమాజం , మనకు మనం తొడుక్కుందాం
భుజకీర్తులు, పెంచుకుందాం భజనబృందం
మనకు తెలియకుండా మనం ఫేసుబుక్కూపస్తమండూకాలం

ఆర్తనాదం

ఆర్తనాదం

వినిపించని ఆర్తనాదం , అగుపింఛని ఆక్రోశం
తల్లి భారతి గర్భాలయాన్ని కూల్చేస్తున్న కామ దాహం
ధర్మ భారతి గుండెలను కాల్చుతున్న అగ్ని దాహం
పసిమొగ్గలను చిదిమేస్తున్న వికృత కేళి విలాసం
విలువలన్నీ శిలువ వేసిన విలయ మూకల వీధినాట్యం
నిలుచున్న నీడలే కాటేస్తుంటే మాతృమూర్తుల దైన్య రోదనం
అడుగడుగునా మహిళామూర్తుల పరాభవ పర్వం
కళ్ళకున్న గంతలు చీకట్లు తప్ప ఏది చూడలేని న్యాయం
అధికారం కాక మరేది కానరాని ప్రజాస్వామ్య ప్రభుత్వం
చూస్తు, చూస్తూ, చస్తున్న సభ్య సమాజ స్మశానం
ఇప్పటికైనా తుదముట్టిందాం ఈ ఘోరామనుషం
దానికి నాందిగా నీ గొంతులో వినిపించాలి రణన్నినాదం
అష్ట దిక్కులు పిక్కటిల్లేలా నారీ భేరీనాదం


గాలిగీతం

గాలిగీతం

నాకు తెలుస్తుంది నా చేతల్లో
నాకు తెలుస్తుంది నా నడకల్లో
నువ్వు నా చుట్టే ఉన్నావని
ఇంకా ఇంకా దగ్గరౌతున్నవని
గాలి అదే గీతాలు రాస్తుంది
నన్ను క్షణమైనా వదలకుండా

నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని
నా కళ్ళముందు వచ్చి కనిపించు
నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నానని
ప్రేమిస్తూ ఉంటానని
నా హృదయం అదే నినదిస్తుందని
దీనికి అద్యంతాలు లేవని
అది నీకే నివేదిస్తుందని

నా కళ్ళ ముందు నువ్వు కనిపిస్తున్నావు
నేను నా హృదయ గవాక్షం నుంచి చూస్తున్నా
నాకు అన్నీ గుర్తుకు వస్తున్నాయి
నువ్వు చెప్పిన ప్రతి మాట, పాడిన ప్రతి పాట
నేను నీ దగ్గర ఒక మాట తీసుకున్నాను గుర్తుందా
నాకు తోడు కావాలని, నేను చేసే ప్రతి పనిలో
అందుకే

నేను ముందుకు సాగుతూనే ఉంటాను
గాలి అదే గీతాలు రాస్తూ ఉంటుంది
నన్ను క్షణమైనా వదలకుందా