19, అక్టోబర్ 2014, ఆదివారం

అమ్మకం

అమ్మ అంత సహజంగా అమ్మకం అలవాటయ్యాక
మారకానికి పనికిరానిదంటూ ఉంటుందా !
కొనేవాడికి మూడ్ ఉన్నప్పుడు
సరుకు అందివ్వటమే
వ్యాపారంలో విజయ  రహస్యం.
కొనేవాడికి లేని నీతి, బూతు
అమ్మేవాడికుండాలి అనుకోవటమే
అసలైన బూతు
కొన్నంత కాలం అమ్మకం సాగించటమే
సిసలైన ఆర్ధిక నీతి
అసలు ,  అంగాంగం అంగట్లో దొరుకుతుంటే
అందం కనిపించకుండా అమ్మేది ఎలా ??
అమ్మేది ఎవడైనా ,
నీలాగే వాడూ ఒక మారకం దారుడే
అమ్మేది ఏదైనా, ఎవరినినైనా
నీ లాగే అన్నీ అంగడి సరుకులే
అయినా , ఎటూ కొనాలనుకున్నాక , అమ్మకం ఆపేయమని
అరవటం ఎందుకు ?
కావాలంటే రేటులో రిబేటు అడిగి
మొదటగా కొనుక్కోవాలి కానీ
వాణిజ్య సూత్రాల్లో జీవితాలు సర్దేశాక
కళ్ళు మూసుకొని అన్నీ
నిజాలు అనుకొని సుఖించాలి కానీ
కళ్ళు తెరిచి దు:ఖించటం ఎందుకు
టేకిట్ ఈజీ ! లెట్స్ సెలబ్రేట్ దిస్ ఈవెంట్
అమ్మటానికి మనకో కొత్త ప్రోడక్ట్ దొరికింది

అమ్మేద్దాం ! దట్సాల్ ! 

25, ఆగస్టు 2014, సోమవారం

లెట్ దెం డై

గాజా ప్రతి రోజు పాత రోజు లాగే ఉంటుంది ,
తేడా ఏముంటుంది ?
మహా అయితే తుపాకి మొనకున్న తలలు మారతాయి,
జీసస్ వదిలేసిన గొర్రెపిల్ల
కసాయోడికి దొరికాక
మరణాలు తప్ప నిర్ణయాలుంటాయా ?
మిస్సైల్స్ పై సిగ్నేచర్ చేసి మరణ శిక్ష వేశాక,
సీజ్ ఫైర్  కి చాన్స్ ఎక్కడుంది ?
గద్దలు నెత్తురు తాగే దగ్గర
కపోతాలతో పనేముంది ?
గాలి స్తంభించిన నేల మీద
గాలి పటాలు ఎలా ఎగురుతాయి
జైల్లోనే జీవితాన్ని బంధిస్తే
ఇల్లేక్కడో ఎవరికి తెలుస్తుంది
గోడల మధ్య దేశాన్నుంచాక
గెలుపెవరికి దక్కుతుంది ?
బాధ పడకండి
అందరూ శవాలయ్యాక,
ద్వారాలు  తెరుస్తారు కదా !
కాటి కాపరికి శవం వస్తేనే కదా పండగ !
ప్రపంచానికి కావాల్సింది పండగలు,
మనుషులకు కావాల్సింది మనశ్శాంతులు
అయినా మరణించాక మనశ్శాంతికి కరువేముంది

ఓ లార్డ్ ! లెట్ దెం డై ఇన్ పీస్ 

17, ఫిబ్రవరి 2014, సోమవారం

రైతురాజు

అతడు వేకువతో మొదలెడతాడు
తన తోడు వేగుచుక్కని వెంట పెట్టుకొని,
ఆకు పచ్చ ఆకాశాన్ని దర్శిస్తాడు
దివాకరుడికి దోవ చూపిస్తాడు.
ఉదయపు వెలుగులో చద్దిమూటై మెరుస్తాడు
మిట్టమధ్యాహ్నం వేళ రేగడి పెరుగై వళ్ళు చల్లబరుస్తాడు
సాయంత్రం వేళ చల్లటి గాలి అయి నవ్వు పూలు పూయిస్తాడు
పొద్దంతా పొద్దు తిరుగుడు పువ్వై తిరుగుతాడు
రాతిరేళ మంచు పువ్వై మనిషికి మంచె కడతాడు
నడిరేయి నక్షత్రం అయి కలలలో తోవ చూపిస్తాడు
రేతిరంతా రేచుక్కై మన చుట్టే తిరుగుతుంటాడు
వాడు సూరీడు కే వెలుగులిస్తాడు
జనాలందరికీ భోజనం పెడతాడు
కష్టాలను భుజానేసుకొని నేలను నమ్ముకొని
సాగుతూనే ఉంటాడు, సాగు చేస్తూనే ఉంటాడు
రాజులకే రాజు, భూతలనికే రాజు, మా రైతురాజు

15, ఫిబ్రవరి 2014, శనివారం

భోది వృక్షం

ఐదేళ్లకోసారి భోది వృక్షం మొలుస్తుంది
నిర్వాచనసదన ప్రాంగణంలో.
చిత్రంగా బుద్దావతారాలన్నీ
బద్దకం వదిలించుకొని
కదనరంగానికి పరుగులెడతాయి
హస్తిన విడిచి.
వస్తుకానుకలు
ఉచిత ప్రసాద వితరణల
బాట పడతాయి.
మూజువాణిలు, మేజువాణీలు
జతకడతాయి.
మోజు మాత్రం ఆసనం మీదే.

శాసనాలనిండా, కాసుల వర్షాలు కురుస్తాయి
చితికిన బతుకలన్నిటికీ అతుకులేస్తామని
కోతలు కూస్తుంటాయి
ద్రవం, ద్రవ్యం దరిద్రమంతై వీధివీధికి సంచరిస్తుంటాయి
బొట్లు, జాకెట్లు, లాకెట్లు, కనికట్టు చేస్తుంటాయి
ఓట్లడుగుతుంటాయి,
అట్లా అట్లా అధికారం కోసం అఱులు చాస్తుంటాయి

తపస్సు అయిపోతుంది
బుద్దావతారాలు సమాధిలోకెళ్ళిపోతాయి
బోదివృక్షం కూలిపోతుంది
ఏలిన్ వారి దయ కోసం కూలిన చెట్టుతో
పాటు కూలీలా నువ్వు మిగిలిపోతావు

10, జనవరి 2014, శుక్రవారం

ఒక ప్రత్యూషం

ఒక ప్రత్యూషాన, ఆ తోటలో
తుషార బిందువులు ఆకులని
ముద్దిడి, కరిగిపోతున్న వేళ
కిటికీ పక్కన కాఫీ కప్పుతో నేను
నా పక్కన నువ్వు,
నీ కురుల వాసన మత్తుగా
అ గదంతా పరచుకుంటున్న సమయాన
రాత్రి మల్లెలు వాడినా ఇంకా వేడిగా చూస్తూ
అగరొత్తుల పొగ మన చుట్టూ ఏకాంత మేఘమై
అలముకుంటూ. తమకంతో నేను కళ్ళు మూసుకుంటే
పెరటి గులాబీలు వంగి నీ పాదాలు చూసి
సిగ్గుతో మరింత తలదించుకుంటున్నాయి
భ్రమరాలు మందారాల పై కాక, నీ అధారలపై
మధువునే చూడాలని ఆరాటపడుతుననయి
గోడవతల గన్నేరు పూలు నీ వంటి
చాయను కాస్తయినా పూసుకుందామని
గోడదాటి వస్తున్నాయి
కుండీలోని మరువాలు నీ మేని వాసన
పీల్చుకుందామని నీవైపు చూస్తున్నాయి
ఇన్ని చూపు బాణాలను తట్టుకుంటూ
సుతారంగా నుదుటి మీద నీలి మేఘాలను
తోసివేస్తూ, నీవు నా ముందు నిలిచి
నవ్విన క్షణాన, నాకు లక్ష భానోదయాలు కదా
నీ చిరునవ్వు తారకలు , నాకు
శత సహస్ర చంద్రోదయాలు

8, జనవరి 2014, బుధవారం

జ్ఞాపకం



ఈ చీకటి నన్ను కాల్చేస్తుంది
భాధని మెలివేస్తూ, గాయాన్ని రేపుతూ
తన కర్కశత్వాన్ని నాపై గాట్లుగా చిత్రిస్తూ
ఇక ఎప్పటికీ తెలవారదు, ఈ హింస కు తెలవాలదు
ఇన నేను ఈ గాయాలను, బాధలను ప్రేమించాలేమో
ఇవి నీవు నాకిచ్చిన కానుకలు కదా
నిన్నటి వరకు నిన్ను ప్రేమించాను
ఇప్పుడు ఈ భాదను కూడా అంతే గాడంగా ప్రేమిస్తాను
ఇక్కడ నువ్వు మరచిపోయిన ప్రేమ ఒక మూలన పడి
మూగగా రోదిస్తూ ఉంది, దాన్నైనా నీతో తీసుకొని వెళ్ళు
నీ జ్ఞాపకాల గాయలను ప్రేమిస్తూ , అ ప్రేమను నేను ప్రేమించలేను
నీ కంట్లో కన్నీళ్ళతోనే ప్రేమను తుడిచేశావేమో కాని
నాకు ఆ ప్రేమ కన్నీటి గ్రందిలా స్రవిస్తూనే ఉంది
నీ కళ్ళలో ప్రేమని కనురెప్పల వెనుక బందించావేమో కాని
నా వంటిలో ప్రతి అణువణువు నిన్ను కాంక్షిస్తూనే ఉంది
విడిపోయాను అని నువ్వు భావిస్తున్నావేమో కాని
నువ్వు నేను కలిసి ఈ గాయాలను ప్రేమించక తప్పదు
ఆ గాయలనైనా దైర్యంగా ప్రేమించు,
విదిపోయింది నువ్వు నేను కానే కాదు ,
ప్రేమ దాని జ్ఞాపకం మాత్రమే ఒకటి నీ దగ్గర
మరొకటి నా దగ్గర పదిలంగానే ఉంటాయి
ప్రయాణిస్తూనే ఉంటాయి,
గాయాలను ఇంధానాలుగా చేసుకుంటూ.

ఎర్రసూరీడు



తమ్ముడూ ! ఎప్పుడైనా ఉదయించే సూరీడును చూశావా
తూరుపు సముద్రపు నీళ్ళు తాగుతూ
ఎర్రటి ముఖంతో లేచి నిలబడే సూరీడుని చూశావా
అమ్మాయి చేతి గోరింటాకు లా ఎంత ముద్దు వస్తాడో.
ప్రపంచపు అశలను కళ్ళలో పెట్టుకొని ఎంత ఆశగా వస్తాడో
ఉపాధి కోసం ఎర్రబస్సు దిగే పల్లెటూరి కుర్రవాడంత స్వచ్చంగా

కాని , ఎందుకో తమ్ముడు.. కాలం గడిచే కొద్దీ
సూరీడు ముఖం తెల్ల బోతుంది...మన చూపుకానదు
అమ్మాయి  చేతి గోరింటాకు వాడి పోయి చెయ్యి మోడువారుతుంది
అమాయకపు కుర్రాడికి అడుగుకో మోసం ఎదురవుతుంది,
పైకి ఎగబాకటం అంత తేలిక కాదు అని అర్దం అవుతుంది
అందరి ఆశలు వమ్ము అవుతాయి, భరించలేని
సూరీడు,.అడుగడున నిప్పులు కక్కుతాడు
అవమాన జ్వాలలలో తనను తాను
కాల్చుకుంటాడు , అందరినీ కాలుస్తాడు.

కాలం ఆగదు కదా ! నడుస్తూనే ఉంటుంది
నిస్సత్తువ ఆవరిస్తుంది
మన శక్తి ని సూరీడు తాగేసి ఉంటాడు
అయినా కోపదోహం తీరదేమో, రోషంతో చూస్తుంటాడు
స్వాంతన కలిపించే తీరిక మనకు లేదు.
ఆకాశం లో ఒంటరి సూరీడు,దగా పడ్డ సూరీడు 
పొగిలి పొగిలి ఏడ్చిన అమ్మాయి ఎర్రటి కళ్ళలా ఉన్నాడు
కుర్రవాడు తిరిగి ఊరొచ్చిన ఎర్రబస్సు రేపిన ఎర్రటి దుమ్ములా ఉన్నాడు
మనల్ని అసహ్యించుకున్న సూరీడు
చివరకు ఆ దుమ్ము మేఘంలో  ముఖం చాటేస్తాడు
చీకటిని మన నెత్తిన గుమ్మరిస్తాడు