13, డిసెంబర్ 2013, శుక్రవారం

సత్య హరిశ్చంద్ర



"దేవీ ! కష్టములెట్లున్ననూ పుణ్యక్షేత్రమైన
 వారణాసిని దర్శించితిమి ! ఈ వారణాసి..
భక్త యోగ పదన్యాసి వారణాసి
భవధురిత శాస్త్ర ఒకరాశి వారణాసి
గంగతట సంభాసి వారణాసి.... "
హరిశ్ఛంద్రుడు అర్దరాత్రి ఎలుగెత్తి
సత్యాన్ని పలుకుతున్నాడు.
సత్తయ్య పొలానికెళ్తున్నాడు
ఉచిత విద్యుత్ వెలిగే సమయం
తడిచిన మడి నే గంగ మళ్ళీ మళ్ళి
తాకుతోంది,  మొదటి మడి ఘాట్
దాటి ముందుకు రానంటుంది.
అయినా  భగీరధ మోటరేసి
పాతాళగంగ  కోసం విద్యుత్త్తపస్సు
చేస్తూనే ఉన్నాడు
అర్దరాత్రి ఆ"లింగ"నంలో ఉన్న
గంగ జారుతుందని
ఈశుడు భయపడ్డాడేమో
మూడో కన్ను తెరిచి మెరిశాడు,
విద్యుత్తు చేతి కందింది
సత్తయ్య నేలకొరిగాడు

" ఇచ్చోటనే.....లేత  ఇల్లాలి
నల్లపూసల చౌరు
గంగలో కలసిపోయే ....ఇది..ఇది.. ..
పిశాచులతో నిటలేక్షజుండు, నిశాలేక్షణుండు
గజ్జె కదిలించి ఆడు రంగ స్థలమ్ము"
హరిశ్చంద్రుడు పాడుతూనే ఉన్నాడు
చందమామ వెలుగుతూనే ఉన్నాడు
చంద్రమ్మకే చీకట్లు కమ్మాయి
సత్తెయ్య కోసం పరుగులెత్తింది
ఊరంతా గుమ్మి కూడింది
" .....కాబోలు వీరు విగత జీవ బాంధవులు
అడలు చుండిరి మహార్తవరమున...."
వార్డ్ మెంబర్ వంగి చూస్తున్నాడు
ప్రెసిడెంట్ ముందుకొచ్చాడు
" .....కాబోలు వారు టక్కరి భూత మాంత్రికుల్
నెమకుచుండిరి కపాలముల కొరకు...... "
పాట సాగుతూనే ఉంది
స్మశానానికి యాత్రా సాగుతూనే ఉంది
వీరదాసు చితిపేరుస్తూనే ఉన్నాడు
చిల్లర లేక చితి కాలదన్నాడు
" బాలసూర్యప్రభా కళితంబై
వెలుగొందుచున్నదది మాంగల్యంబు కాబోలు...
....దానిని ఏ వెలకైనా తెగనమ్మి.........."
హరిశ్చంద్రుడు సత్యం పాడుతూనే ఉన్నాడు

28, నవంబర్ 2013, గురువారం

తీరంలేని తుఫానులు

ఆ కళ్ళలో తుఫాన్ లు తీరం దాటవు
చెలరేగుతూనే ఉంటాయి,
వర్షిస్తూనే ఉంటాయి.
ఆ కంటి చివర మాగాణం లో
తడిచి తడిచి కుళ్ళిపోయి పండని
తాలు గింజలు రాలుతునే ఉంటాయి.
కన్నీటికి ఎగువునున్న కనుమభూములు
నీరందక ఎండుతూనే ఉంటాయి.
తడిసిన బుగ్గల మీద పనికిరాని
గడ్డి పెరుగుతూనే ఉంటుంది
కాడి మోసి మోసి, వాచిన భుజాల
మధ్యలో తల కుంగుతూనే ఉంటుంది.
గుండె మోటారు అందని నెత్తుటి
చుక్కను దేహమంతా నింపాలని
విశ్వప్రయత్నం చేస్తూనే ఉంటుంది
సత్తువ లేని చేతులు ఎరువు కోసం
ఊపిరిని తూర్పార పడుతుంటాయి
ఎండిన డొక్క డొంకల్లో
ఎలుకలు పరిగెడుతూనే ఉంటాయి
బొరియలు తొలుస్తుంటూనే ఉంటాయి
మట్టి కొట్టుకున్న  కాళ్ళ మీద
ఎండిపోయిన కల్లాలలో తేలిన రాళ్ళు
గాయాలు చేస్తూనే ఉంటాయి
ఆ కళ్ళలో తుఫానులు ఎప్పటికీ
తీరాలు చేరవు, వర్షాలు ఆగవు



22, నవంబర్ 2013, శుక్రవారం

ఒక రాత్రి

ఒక వెన్నెల రాత్రి
ఎదురుగా అనంత సముద్రం
ఇసుక తిన్నెలపై ఒంటరిగా నేను
భీకర సముద్ర ఘోష, నా ఎద ఘోషను అణచివేస్తూ
సరుగుడు చెట్లమీదుగా గాలి, నా రోదనను అధిగమిస్తూ
వెన్నెల బొట్లు బొట్లుగా కెరటాల మీద కురుస్తూ
నా కన్నీటిని కళ్లలోనే దాచేస్తూ
ఎక్కడనుండో లీలగా ఓ జాలరి పాట
భాష , సాహిత్యం ఏది అర్దం కావటం లేదు
కాని ఏదో బాధను భారంగా మోసుకొస్తూ
నా కాళ్ళు ఆ భారాన్ని మోస్తానని పాటవైపు పరుగులెత్తుతున్నాయి
ఎంత దూరం వెళ్ళినా ఇంకా దూరంగానే ఉంది,
మబ్బులు వెన్నెలను కమ్మేశాయి
చీకటిలో దారీ తెన్ను తెలియలేదు
వెలుగు కోసం చూశాను
దూరంగా సుదూరంగా ఒక చిన్న దీపం
పరుగులెత్తాను దీపం వైపు
అప్పుడు తెలిసింది
అది దీపం కాదు అని
మండుతున్న చితి అని
చితినుండి ఒక మండే కట్టెతో
వెర్రి  గా పాట వైపు పరుగులెత్తాను
ఇంకా పాటగాడు దొరకలేదు
పరిగెత్తి పరిగెత్తి అలసి పోయాను
అక్కడో నీటి చెలమ, దాహం వేసింది
ఒక్కసారి దాహం కోసం చెలమలోకి వంగాను
చెలమలో నా ప్రతిబింబం
అప్పుడు తెలిసింది పాట నాదేనని
బాధ నాదేనని, చితి మంట నా ప్రేమదని

(నవంబర్ 2013 , కౌముది ఈ-పత్రికలో ప్రచురితం)

18, నవంబర్ 2013, సోమవారం

మై ఇండియన్

ఇంకా ఇన్ డిపెండెట్ స్టేట్ హుడ్ లో ఉన్న
కంట్రీని ఇండిపెండెట్ స్టేట్ అనుకుంటున్న
ఓ ఇంటలెక్చ్ వల్ ఇండియన్, నో ఇట్
ఇక్కడ డెమోక్రసీ జస్ట్ ఎ డెమో పీస్
వాడటానికి పనికి రాదు, వాడాల్సిన అవసరమూ రాదు.

ఊడలు ధిగిన ఫ్యూడల్ సిస్టమ్ కి కానస్టంట్ గా
బలి అవుతునే ఉంటావు మైడియర్ ఫెలో స్లేవ్.
 అది తెలుసుకోక ,ఇంకా నిన్ను సేవ్ చేసే వాళ్ళున్నారని,
 ఆశ గా ఎదురు చూసి విసిగిపోయి శాడ్ ఫేస్ పెట్టకు.
తరతరాల ఫిలాసిఫీని తలకింద పిల్లో చేసుకొని పడుకో.
నిద్ర కొద్దిసేపో, శాశ్వతమో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది

ఎలక్షన్స్ కోసం చూసి  సిస్టమ్ ని కరెక్షన్  చేద్దామని
ఆశ పడుతున్నావా , ఓ సిల్లీ సిటిజెన్, ఇట్స్ ఏ ఫన్
కరప్షన్ కి  నైస్ గా వైట్ పాలిష్ చేసి
నీముందుకు వచ్చిన అల్ పార్టీ కొలీజియం సరదాగా
సిటిజన్స్ తో అడుకొనే టగ్ ఆఫ్ వార్ అది.
నువ్వు , నీవారు కూడా చెరోపక్క చేరి ఆడుకోండి
గెలిచేది పార్టీస్ , ఓడేది నీ ఓటు అని తెలుసుకుంటావు

 డోంట్ వర్ర్ బ్రదర్ , ఈ సారి
.రెడ్ క్యాజిల్ నుండి ఆగస్టు లో
వెలువడే సందేశం కోసం చూడు,
నీ దేశం ఎంత వెలిగిపోతుందో తెలుస్తుంది
నీ బ్రతుకెంత కాలిందో నీకెప్పుడో తెలుసుకదా
బైదివే, ఇ నీడ్ ఏ యాష్ ట్రే , టూ కీప్ యువర్ యాషస్


ఎన్నెన్నో

వీధి దీపాల వెలుగులో
ఒంటరి నై  నే నడుస్తున్న వేళ
గాలి నీ స్వరం పాడి నా పాదాల వేగాన్ని
ఎన్ని సార్లు ఆపాయో !

వీదులన్నీ తిరిగితిరిగి, స్వరకర్త కానరాక
నా నిశ్శబ్ద నీరవ ఏకాంత గది తలుపులు తీసి
నీ తలపులు మరువలేక , రోదిస్తున్న మది గీతం
ఎవరికీ వినిపించరాదని, కనిపించని  నీ స్వరానికే
శబ్దసౌందర్యాన్ని పెంచి పెంచి గదంతా వ్యాపింప చేసి
అలసి సొలసి నిదురించిన రాత్రులెన్నో !

నన్ను చూసి నవ్వుతున్న లోకంలో ఏకాకి నై
రగిలే హృదయంతో , బేలనై , వెన్నెల చూడలేక
ఇప్పుడు ఒక  చీకటి వర్షం కురిస్తే బాగుణ్ణు
నా బాధాసప్తశతి కి చితి అంటించటానికి
అనుకున్న రోజులెన్నో !

ఉదయ వ్యాహ్యళి ఉద్యానవనాన నడిచి వెళ్తూ
నువ్వు విడిచిన వెచ్చటి ఊపిరి, నన్ను
గజగజా ఎందుకు వణికిస్తుందో అర్దం కాక
ముఖాన్ని భుజాల మధ్యలోకి కుంగదీసుకొని
నా హృదయాన్ని ప్రశ్నించుకొన్న ప్రత్యూషాలెన్నో !

నా వేళ్ల చివరలను మండిస్తున్న శీతల పవనాల
ధాటికి తాళలేక దుప్పటి ముసుగును మరింత
దట్టంగా పరుచుకుంటున్న వేళ,
నీ తలపుల చలిపులి దాడిచేసి కంబళి నిండా
రంధ్రాలు పొడిచి నప్పుడు నన్నునేను
పదిలపరచుకోలేని భీకర గాలులెన్నో !

గవాక్షాలనుండి అక్షాంశ రేఖలదాకా
పరికించి చూసిన నా జీవనరేఖ కన్పించక
ఊపిరి అగినప్పుడు,  రేఖామాత్రమైన
 నీ ఉచ్చాశ నిశ్వాసాలు కనిపించక
నా ప్రాణం కొట్టుకులాడిన సంధర్బాలెన్నో

ఇక నాకు వసంతాలు రావని తెలిసి తెలిసి
ఈ మిగిలిపోయిన శిశిరాన్ని ప్రేమించి
శిశిరవాసంత సమాగ హేళ కోసం
నన్నునేను సమాయత్తపరచుకున్న క్షణాలెన్నో


3, నవంబర్ 2013, ఆదివారం

నేను నాదేశం

నాకు ఉదయాన వార్తాపత్రికలు వద్దు
ప్రతినిమిషం పలకరించే చానెళ్ళు వద్దు
నాలో పెరుగుతున్న భయాన్ని ఆపాలి
దేశమంటే నాకున్న భయాన్ని ఆపాలి

ఉద్యానవనాన ఉషోదయపు నడకలు వద్దు
సంధ్యా సమయాన ఆనంద వాహ్యాళివద్దు
ఎప్పటికీ ఈ గృహనిర్బంధం వీడొద్దు
నన్ను నా దేశం భయపెడుతుంది
విద్వేష సమూహాల విశృంఖల పద ఘట్టనల
నా గుండెల్లో ప్రతిక్షణం ప్రతిధ్వనిస్తున్నాయి

"అమ్మా ! భరతమాత స్వేచ్చా స్వాంతంత్ర్యాలు
ఏవమ్మా ! " ఆని ఆశ్చర్యపడే భావి భారత పౌరులకు
నా భయంతో సమాధానం చెప్తాను, అవి నాతో పాటు
స్వచ్చందంగా చెరసాలలో మగ్గుతున్నాయని ,
ఊపిరి తీసుకోనేందుకు భయపడుతున్నాయని.

ఎవరికో క్రోధం, మరెవరికో ఉన్మాదం
మరొకరికి ఉక్రోషం, ఆక్రోశం, దారిద్ర్యం
ఏదైతేనేం రక్తపు నెగళ్ళు రగిలిస్తున్న సమాజం
భయపడి ,బిక్కుమంటున్న నేను, నా దేశం

నా కణతల మీద పెట్టిన ఈ తుపాకీ
లో మందుగుండు ఎప్పటికి పూర్తవుతుంది
నా దేశంలో పుట్టిన ఈ విబేధాల
కుంపటి ఎప్పటికీ చల్లారుతుంది
హిమాలయాలు కరుగుతున్నా
క్రోధం కరగటం లేదు
సముద్రాలు పెరుగుతున్నా
మానవత్వం పెరగటం లేదు

నీలాకాశాలు, నల్లటి నేలలు
పచ్చటి పైరులు, తెల్లటి నదులు
అన్నిటికి రంగు మార్చి
ఎర్రటి నెత్తురు పులుముతున్న
ముష్కర మూక అగడం ఎప్పటికీ అగుతుంది
ప్రేమలు,అనురాగాలు, అప్యాయతలు
అనందాలు, అన్నిటిని హతమారుస్తున్న
ఈ స్వార్ద శక్తుల కుట్ర ఎప్పటికీ ఆగుతుంది

వార్తాపత్రికల్లో  ఆనందాన్ని ఎప్పుడు చూడాలి
ప్రతినిమషం వార్తల్లో చిరునవ్వులు ఎప్పుడు చూడాలి
నా భయాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోవాలి
అసలు నేను నా దేశాన్ని ఎప్పుడు ప్రేమించాలి ??

షేరింగ్ అటో

ఇంతకు ముందు అక్కడ నల్లటి త్రాచు
లాంటి రోడ్డుండేది. వానొచ్చింది
పాము వెళ్ళిపోయింది కుబుసాన్ని

రాళ్ల సందున వదిలేస్తూ.
ఆ రాళ్లపై కాళ్ళు మోపి
ఇరుకులో పరిగెడుతుంది
మనుషులను మోసుకొని
ఒకరి భుజాల మీద మరొకరినెత్తుకొని
అసలైన సామ్యవాదానికి,
సిసలైన అర్దం చెబుతూ
గుంతలను దాటుకుంటూ
చెంగు చెంగున దూకుతుంటుంది
ఇప్పుడు అందరూ స్వేదం కక్కాల్సిందే
అత్తరులా ఒకరికొకరు పూసుకోవాల్సిందే
దాని వేగాన్ని రాకెట్లూ అందుకోలేవు
ఏ టెక్నాలజి పట్టుకోలేదు
తొమ్మిదో నెల పురిటినెప్పులు ఎనిమిది నెలలకే
అరవై ఏళ్ళ వెన్నునెప్పులు ముప్పై ఏళ్లకే
వచ్చేంత చండ ప్రచండ వేగం
పురాణాలలో నుండి పట్టణాలలోకి
పరుగెత్తుకుంటూ వచ్చిన పుష్పకవిమానం
తనకు సరిపోకపోయినా ఎప్పుడూ
మరొక అతిధికి ఆహ్వానం పలికే సత్సంప్రదాయం
అదే మన భాగ్యనగర ఆటో ప్రయాణం

30, అక్టోబర్ 2013, బుధవారం

మాజీ ప్రేయసి

ఓ నా మాజీ ప్రేయసి
ఎందుకీ ఆందోళన
నేనేమి కొత్త గుర్తులు కోరలేదే
పాత గాయాలు రేపలేదే
అకస్మాత్తుగా కలిశావు
ఇది నేను కోరుకున్న కలయిక కాదే
మరి నన్నెందుకు నిర్దయగా చూస్తున్నావు

నా మనసులో నువ్వు చేసిన గాయాలు
నీ కంట బడితే నన్నెందుకు నిందిస్తావు
నా మనసు మీద నేనేమి ముసుగు వేసుకోలేదే !
అవి నీ కంట బడకుండా దాచటానికి
ఇప్పుడు ముసుగు వేసుకోమంటావా ?
నా కళ్ళలో తడిని చూసి
నీ మనసు చెమ్మగిల్లితే నన్నెందుకు తోసేస్తావు !
నా కనురెప్పలు ఇంకా మూతపడలేదే
కన్నీటి తడి నీ మనసుని తాకకుండటానికి,
ఇప్పుడు కన్ను మూయ మంటావా?

నీకు తెలుసు కాలం గడిచిందని,
కాని నాకు నిన్నే మిగిలిందని,
అది నిన్నే మిగిల్చిందని,
అన్ని నీకు తెలుసు.
నీవు బాధపడకు ప్రియా
నన్ను అనునయించాలని ప్రయత్నించకు
కొన్ని సార్లు లేని సుఖం కన్నా
ఉన్న దుఃఖం లో ఒక తియ్యదనం ఉంటుంది
నీ జ్ఞాపకాలతో కూడిన దుఃఖం కూడా
నాకు ఆనందమే
అ దుఃఖానికి నన్ను దూరం చెయ్యకు.

మరో ప్రేయసిని నా కోసం వెతకకు ప్రియా
నేనెవ్వరినీ నీతో పోల్చలేను.
తప్పొప్పులు, ప్రేమా వీడుకోలు, అన్ని నాకు నువ్వే
అయినా అధ్యాయం ముగిసింది
నా ప్రయాణం అక్కడ ఆగింది.

గాలి విసిరి కొట్టి పేజిలు చెరిగి ముగిసిన అధ్యాయం దగ్గర
మళ్ళీ కలిశావు, మాజీ ప్రేయసీ
అక్కడ నా జ్ఞాపకాల మైలు రాయిని పాతిపెట్టి
తిరిగి కొత్త అధ్యాయం మెదలు పెట్టు.
మరో సారి సుడి గాలులు రాకుండా
తలుపులు మూసిపెట్టు. లేకుంటే
ఆ గాలి మైలు రాయిని కదిలిస్తుందేమో

అందుకే మాజీ ప్రేయసి
వేగంగా వెళ్ళు, వెనుదిరిగి చూడకు
ముగిసిన అధ్యాయానికి , మూల్యాంకన చెయ్యకు
అగిన ప్రయాణికుడికోసం ప్రయాణం ఆపకు

27, అక్టోబర్ 2013, ఆదివారం

తుషారం

తన పేరు నా హృదయం నిండా అలముకొని ఉంది
ఓ తుషారమా ! చల్లగా చెప్పు నా ప్రియురాలి ముంగురులు మెల్లగా తాకి
తన తలపుల పానుపుపై నే వెచ్చగా పవళిస్తానని.
నన్ను తన గుండెలలో పదిలంగా దాచుకొమ్మని

నా గుండెనిండా గాయాలున్నాయి,
నాకళ్ళనిండా నీళ్ళు నిలిచున్నాయి
నాకు క్షణాలన్ని యుగాలవుతున్నాయి
ఓ తుషారమా ! ఈ విషయాలన్ని మరువకుండా చెప్పు
నన్ను మరచి , విడిచి పోవద్దని

నా మది మేఘాల వెంట తిరుగుతుంది
తను కనిపిస్తే ఒక్కసారిగా ప్రేమ తో తడిపెయ్యాలని
నా ప్రేమ గాలితో పాటు ప్రయాణం చేస్తుంది
తను కనిపిస్తే ఒక్కసారిగా అనురాగమై చుట్టేయాలని
ఓ తుషారమా ! ఈ విషయాలన్ని మరువకుండా చెప్పు
నన్ను మరచి , విడిచి పోవద్దని

జనగళం

జనగళమంత అధినాయకి జయహే
అని పాడాలనే వెంపర్లాటో
 వంది మగధులే పాడే వంతపాటో
 ఏమో ఏమౌనోగానీ అవ్వని ఈ పని
జనం,భజనం, విభజనం , విందు భోజనం
అన్ని అందుబాటులోనే,
 లోనే లోలోనే లోలోపల్లోనే ఉన్న ఆలోచనలు
, నువ్వు తగిలించుకున్న సులోచనాలు అన్ని తెలుసు
 నాయకా,.వినాయకా,
కాయ్ కాయ్ పందెం కాయ్
, పోయేది పందెం కోడే కదా
ప్రజలది కోడి మెదడే కదా
ఫార్సులు, బోఫార్సులు,
స్కాములు, కిస్ కో మాలూమ్ హోతా హై
నారాజ్ మత్ కరో, నా రాజు నువ్వే, ఈ రోజు కి అంటే చాలు
బూజు పట్టిన  ధిమాక్ ల్ కి, ఇదే లే మందు
మొన్న పోసిన మందు తోనే కదా
ఐదేళ్ళు రాజ్యం చేసింది
నెత్తిన కధక్, కథాకళి, ఆడింది
ఇప్పుడు మరో కథ చెప్తే చాల్లే
తకధిమి, తకధిమి తస్సాదియ్యా
 బ్రతుకే తోలు బొమ్మయ్యా
వస్తా, మళ్ళొస్తా
ఐదేళ్లకొస్తా, కొత్త కథ చెప్తా



ప్రేమామర

ఎన్నాళ్లకు వీచించో ఈ ప్రేమామర
ఇక ఋతుపవన గమనంలా
నన్ను నిలువెల్లా తడిపేస్తూ
నన్ను అనురాగ వర్షంలో ముంచేస్తూ
గడ్డ కట్టిన నా హృదయాన్ని
నిలువెల్లా కరిగిస్తూ,
ఓ తెలియని, తియ్యని
భావాలా వెల్లువతో
నను తనలో కలిపేస్తూ.

నా హృదయ మేఘం, నీ హృదయం తో తాకిన
ప్రకంపనలు, తనువెల్లా మెరుపులు
ఈ అనుభూతులు అన్ని కొత్త కొత్తగా,
ఇప్పుడే నెర్ర విచ్చుకున్న నేల, చినుకును
ఆర్తిగా అదుముకొన్న అవేశం.
మరోమారు సరికొత్త గా నాలో పచ్చదనం
మొలకెత్తింది,
ప్రతి రోజు ఆర్తిగా కురిచే నీ ప్రేమ వర్షం తో
మరింత ప్రేమగా నా పచ్చదనాన్ని పొదవి పట్టకుంటూ
మత్తు గా నేలంతా నువ్వు పరచిన మట్టివాసన పీల్చుకుంటూ
నా హృదయాన్ని పంట చేసి నీకిస్తున్నా ప్రియా
ఇంతకన్నా నా ప్రేమను నీకెలా చెప్పగలను
నవ్వుతున్న పంట చేలో చూడు నీ పేరే కనపడుతుంది
ఆ గాలిలో నీ పేరే వినపడుతుంది
ఒక్కసారి నువ్వు తాకి చూడు , ఎంతలా పులకిస్తుందో
నిన్ను చేరాలని ఎంత తపన పడుతుందో
మరో సారి మేఘమై వర్షించు,
నా గుండెల నిండుగా
ప్రతిక్షణం సంపూర్తిగా నీకోసం పరితపించే

నా కౌగిలిలో చేరి అలా ఉండిపో ప్రియా

21, అక్టోబర్ 2013, సోమవారం

నేను


నేను మిగిలిపోయినోడిని
 దోచుకెళ్లాక మిగిలిపోయినోడిని
 ఒక పల్లెటూరిని 
డొక్కలెండిన బక్క రైతుని
 బురదలో మిగిలిన కలుపు మొక్కని 
పొగాకు బేర్ని మిగిల్చిన బూడిదని 
ఎండలో ఎండుతున్నజొన్నపంటని
 పగలు చూసి కుంగేవాడిని 
రేత్రి చూసి ఏడ్చేవాడిని 
నరనరాలు చచ్చుపడినోడిని 
నెత్తురు ఇంకినోడిని 
చేవ చచ్చినోడిని 
చేతకానోడిని 
కాడిపడేసినోడిని 
దుక్కి దున్నలేనోడిని చె
చెట్టుకు ఉరేసుకున్న పగ్గాన్ని 
తెగిపడిని రైతు పెళ్లాం పుస్తెని

రెందుపాయలు

ప్రియా ! నీకు గుర్తుందా !
ఆరోజు నా కళ్ళలో కన్నీళ్ళు చిమ్ముతూ
నన్ను నువ్వు వదిలివెళ్ళిన రోజు
నాకు గుర్తుంది
గుండె నిండా గాయాలతో ఒంటరినై
నీ వద్దకు వచ్చిన రోజు
నువ్వు నీ ఒడిలో నాకు చోటిస్తావని
కొండంత ఆశతో నీ వద్దకు వచ్చిన రోజు
నీ వెచ్చటి కౌగిలి లో ఓదార్పు కోరుకున్న రోజు
కాని, నువ్వు నన్ను వదిలి వెళ్ళావు
నన్ను నీ వాడిగా చేసుకొనే ధైర్యం లేక నన్ను
దీనుడి ని చేసి పారిపోయావు
నా దుఃఖాన్ని సముద్రం చేశావు
నా ఒంటరి తనాన్ని శాశ్వతం చేశావు

ఇప్పుడు నా జ్ఞాపకాలు గురుతు వచ్చాయా
నేనెందుకు నీకు గుర్తు వచ్చాను ?
ఇంకా మనిద్దరం, మనం లా మిగిలున్నామా
 నువ్వు నేను రెండు పాయలుగా చీలి
మృత సముద్రం వైపు ప్రవహిస్తూనే ఉన్నాం కదా
ఇప్పుడు నేను నీకేమి ఇవ్వగలను
 అసలు మన మధ్య ఏమి మిగిలింది
 ఎప్పుడో ఇద్దరం కలిసి ప్రవహించి విడిపోయామన్న
 ఒక చిన్న బాధాకర జ్ఞాపకం తప్ప.

 ఇప్పుడు తిరిగి మనిద్దరం
ఎలా కలుద్దామనుకుంటున్నావు
మన మధ్య అడ్డుగోడలా అనంత పీఠభూమి మిగిలిపోయిందే
వద్దు, కలిసే ప్రయత్నం చెయ్యకు
మన ప్రణయం కోసం మహా ప్రళయాన్ని సృష్టించకు
సాగిపోనీ ఇలా కడలి ఒడికే, జీవిత చరమాంకంలో
అక్కడ ఇద్దరం కలుద్దాం
అక్కడ శాశ్వతంగా మన అస్థిత్వాలను కోల్పోయి
అనంత సాగర జలాలలో బందీలవుదాం

ప్రేమ సౌధం

నీ జ్ఞాపకాల శయ్య పై వేచి వేచి నా జీవం శిల అవుతుంది
నీ తలపుల పాన పాత్ర తాగి తాగి నా స్వరం మూగ పోతోంది
ఈ గులాబి తోటలో నీకోసం కట్టిన సౌధం నిలిచే ఉంది

అదుగో అక్కడే నేను నా జీవనకావ్యరూపాన్ని
శ్వేతపత్రంపై లిఖించి నీకంకితమిచ్చాను
ఇక్కడే నా అత్మసంచితగానాన్ని
నిస్తంత్రీ స్వరవీణపై నీ కోసం వినిపించాను
నా జీవనాన్ని తిరస్కరించావు
నా గానాన్ని నిలువరించావు

ఇప్పటికీ తోట లో గులాబీలు వికసిస్తున్నాయి
తిరస్కరించిన నా జీవనం అందులో వాసంతమై మిగిలేఉంది
సౌధం నీకోసం చూస్తూనే ఉంది
నిలువరించిన నా గానం ఈసౌధం అంతా ప్రతిద్వనిస్తూనే ఉంది

ఆ వాసంతల పూగంధాల గులాబిలు రోజు నీ శిరోజాలను తాకుతున్నాయి
ఆ శబ్దాలయ సౌధ సంగీత స్వర విలాసాలు నీ చెవులను ముద్దాడుతున్నాయి
అయినా నీకు తోట ఎక్కడుందో తెలియదు, సౌధం కన్పించదు
నువ్వు నడిచే దారిలో నా తోట లేదు, సౌధం లేదు
ఈ సుగంధాలు, సంగీతాలు ఎక్కడివో చూసే సమయం నీకు లేదు

ప్రియా ! ఒక్క సారైనా చూడు
ఈ సౌధం, ఈ తోట నీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి
రా నీ పాదస్పర్శతో ఈ తోటలో రాగాలు పలికించు
ఈ సౌధంలో వాసంతాలు కురిపించు
నీ పాదంతో శిలా సదృశ్యమైన నా జీవనానికి ఊపిరిలూదు
నీ కరస్పర్శతో మూగబోయినా నా స్వరానికి స్పందననివ్వు

11, అక్టోబర్ 2013, శుక్రవారం

బధిరశంఖారావం

నీ కళ్లముందున్న స్వర్గాన్ని పోగొట్టుకొని
పశ్చాత్తాపం ఎందుకు ?
గతంలో గుర్తించలేని విషయం గురించి

వర్తమానం లో వెతలెందుకు ?
నీ వెతల కథల తో నా గతం లో వెలుగులు పూస్తాయా !
నా వర్తమానంలో కాంతులు వస్తాయా !
తిరిగి ఎందుకు వచ్చావు ?
నీ జ్ఞాపకాల నా జీవనం లో నువ్వు కోల్పోయిన నిన్ను వెతుక్కోవటానికా !
పునర్నిర్మించుకుంటున్న నా భవిష్యత్తుని గతాల స్మృతులతో కూలదొయ్యటానికా !
విడిపోయిన కారణం చెప్పలేదు సరే ! ఈ రాక కైనా కారణం చెప్పు

అకస్మాత్తుగా వచ్చిన ఇప్పటి నీ రాక కోసం నా హృదయం సిద్దంగా లేదే !
నేనిప్పుడిప్పుడే నా లక్ష్య సౌధానికి చేరే సోపానాలు నిర్మించుకుంటున్నా
సోపానాలపై వడివడిగా పైకి ఎదిగే ప్రణాళికలు రచించుకుంటున్నా
ఆ సోపానలలో ఎక్కడా నీ అనవాలు కన్పించకుండా జాగ్రత్త పడుతున్నా
ఇప్పుడు బాధలు లేవు, సంతోషాలు లేవు నిర్లిప్త నిమిషాలు తప్ప
తిరిగి మరోసారి ఈ ఉద్వేగాలెందుకు ! ఉపశమనాలెందుకు
మిగిలిపోయే ఉపయోగం లేని ఉద్రేకాలెందుకు

నా మాటలని నువ్వు నీ మౌనం లో నిదురపుచ్చాక
నాకు నిశ్శబ్దంలోనే బ్రతుకీడ్చటం అలవాటయ్యింది
ఇప్పుడు నీ మాటల్లో శబ్దతీవ్రత నన్ను సోకటం లేదు
స్పందన కోల్పోయిన హృదయవీణ పై రాగాలాపాన ఎందుకు
ఇప్పుడిప్పుడే భౌతిక ప్రపంచంతో సంధానం అవుతున్న నాకు
మరో ఊహా ప్రపంచపు అందాలసౌగంధాలెందుకు ?
త్యాగమో, బోగమో, నా యోగమో ఏదైతేనెం గతించిన కాలం
ఎవరికీ అనందాన్నివ్వలేని ఈ నిష్పల ప్రేమగానం ఇప్పుడు ఎవరికోసం

నేను నా మౌనరాగం లో అనందాన్ని వెతుక్కుంటున్నాను
మరో సారి నాకు అనురాగం వినిపించకు,
నాకు నేను బధిరత్వంలో బందీనయ్యాను
నా ముందు ప్రేమశంఖారావం పూరించకు

4, అక్టోబర్ 2013, శుక్రవారం

సర్వేజనా

ఈశోపనిషత్తులకు నూతన నాశనోపాఖ్యానం
శూన్యామదః శూన్యామిదం శూన్యాత్ శూన్యముదఛ్యతే
శూన్యస్య శూన్యామాదాయ శూన్యామేవాశిష్యతే
ఓం యుద్దః యుద్దం యుద్దః
సర్వేజనా నాశనో భవంతు

కన్పించేది శూన్యం, కన్పించనది శూన్యం
శూన్యం నుండి శూన్యానికి ప్రయాణం
మిగిలేది శూన్యం, ఎందికీ ప్రహసనం
స్వాగతిద్దాం ఈ యుద్దం
నిత్యనూతనం ఈ జన నాశనం

కొత్త నిబంధనలలో మరో నిర్బంధ గ్రంధం
అడుగు; ఇవ్వబడదు
వెతుకు; దొరకదు
తలుపుతట్టు; తెరవడదు
అందుకే అడగకు, లాక్కో
వెతకకు, దోచుకో
తలుపు తట్టకు, పగల గొట్టు
దేవుడు కనపడితే శిలువ వెయ్యి
సైతానుకు హారతులియ్యి

రా రా , నువ్వు నేను శత్రువులం ఇద్దరం కలిసి కత్తి కత్తి కలుపుదాం
ఎండిన శవాల ఎముకల పొడి ని గంధం లో కలిపి వాసన పీలుద్దాం
కుళ్ళిన శవాల కండరాలతో అద్దాల భవంతులు కడదాం
చితిమంటల వేడిలో మనం వెచ్చగా నిదురపోదాం

3, అక్టోబర్ 2013, గురువారం

తప్పెవరిది

రోడ్ పక్కన హోర్డింగ్ లో అందాల
అడబొమ్మ పై 'కామం'టేస్తున్నాయి
అంగాంగ శృంగార భంగిమల్లో

ప్రతి అంగం అగ్గి రాజేస్తుంది
సెల్ ఫోన్ టవర్ల మీదుగా బలంగా
బూతు గాలి వీస్తుంది
నీలిదంతాల మధ్య బాహాటంగా
నీలిచిత్రం దర్శనమిస్తుంది
అంతర్జాలంలో అతివల
అందాల అంగడి వలవేస్తోంది
కంప్యూటర్ల లో పెరిగిన వేడి
దేహమంతా పాకుతుంది
టెక్నాలజీ గోడల మీద
నగ్నత్వం బట్టలారేసుకుంటుంది
సెకను సెకనుకు సెక్సాలజీ
రాకసి అకలి పెరుగుతుంది
ప్రతి రేపటి కి ఓ రేపు పాపంలా
రూపం దిద్దుకుంటుంది,
పాపలను కంటి పాపలను
బలి తీసుకుంటుంది
తప్పు టెక్నాలజీ దా
మనిషిదా
మనిషి మనసుదా
సమాజపు పోకడదా
ఎవరిదైనా
అభం శుభం తెలియని జీవితాలు
ఆదిలోనే బలవుతున్నాయి
చిన్నతనంలోనే
చిద్రమవుతున్నాయి

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

a word

a word from you made me discover a new life
it makes me  to love things that i did not liked before
a word from you makes me forget about everything
it makes me fell the value of mine, and be secure for my life
a word from you makes me see what i cant see
it makes me free from all the pains i had and feel alive

where was all this love before?
how i lead my life all these days
before you came, i spend years and years taking my self
because of loneliness
when was in deep pain  i did not find anyone to talk

but today
i know where to start my lovely life
and now
if you call for me, surely i would not wait
if someone made me upset i forgive
and if am wounded i will forget
this is all just because of your word
a word from you given a life to me
a word from you ... just a word from you

నిశీధిగానం

బహూశా అది ప్రేమేనేమో నాకు తెలియదు
కాని అది ఓ ముగిసిపోయిన అధ్యాయం
వర్షం వెలిశాకా గులాబి మీద నిలిచే చివరి బొట్టులా

కొండల మధ్య పాటముగిశాక, వినిపించే ప్రతిధ్వనిలా
ముగిసిపోయిన ఒక అనంద క్షణం

వెనుదిరిగి చూస్తే అంతా నిశ్శబ్ద సంగీతం
తిరిగి ఆ వర్షం రావాలి, ఆ పాట పాడాలి
మనం గడిపిన క్షణాలు కావాలి, కానీ

మనం కలిసిన క్షణం నుండి ఈ కాలమెందుకో
కలిసున్న క్షణాలను జ్ఞాపకం పెట్టుకోలేనంత వేగంగా పరుగులెత్తింది

నిన్ను కరిగిన కలలా నన్ను బ్రతికున్న శిలలా మిగిల్చేసింది
తీరని నా ప్రేమ దాహం నీ జ్ఞాపకాలు నింపిన కన్నీటితో నా మనసుని తడుపుతోంది
ఆ బాధలోనే సేదతీరాలని ఈ నిశీధి రాత్రులలో శివరంజని రాగమాలపిస్తోంది

అందుకే ఆ క్షణాలు కావాలి, ఆ వర్షంకావాలి, అ పాట కావాలి
నన్ను నేను నీకు నివేదించుకోవాలి

గుడ్లగూబ

నేనో గుడ్లగూబనై చూస్తూనే ఉన్నా
గబ్బిలాలు ఇక్కడే వేలాడుతున్నాయి
ఏనుగులు ఇక్కడే ఘీంకరిస్తున్నాయి
కోళ్ళు ఇక్కడే గుమ్మికూడుతున్నాయి
గద్దలు వాటి చుట్టే తిరుగుతున్నాయి
చెట్లన్నీ అకుల్ని రాల్చేస్తున్నాయి
రాలిన ఆకులు నేలను తూట్లుపొడుస్తున్నాయి
నదులు గడ్డ కట్టుకుపోతున్నాయి
వెలుగు నగరాన్ని మింగేసింది
చీకటి వెలుగును కప్పేసింది
కప్పలు నీటి మీద నుండి నేలకొచ్చాయి
నీరుందనుకొని వాటివెంట వచ్చిన
 చేపలు భోజన పళ్ళెంలోకి ఎగిరిపడ్డాయి
అంతా చూస్తున్నా
గుడ్లగూబనై చుట్టూ చూస్తున్నా

21, సెప్టెంబర్ 2013, శనివారం

విప్లవనాయకుడు

ఓ మృత వీరుడా
నిన్ను ప్రేమించటం నేర్చుకున్నాం
చరిత్రపుటల్లో నిలిచిపోయిన నిన్ను
మా హృదయపుటాల్లో దాచుకుంటాం
నీ దైర్యంతో మృత్యువును భయపెట్టావు
నువ్వు శిశిరం లో నడిచి
మాకు వసంతాన్నిచ్చావు
నీ అరచేతిలో మహా జన సముద్రాన్నుంచావు
ఎత్తిన నీ పిడికిలి తో పిడుగులు కురిపించావు
నీ నవ్వుల వెలుగుతో
విప్లవ జ్యోతులు రగిల్చావు
నీ తిరుగుబాటు నిన్ను శిఖరాలు చేర్చింది
మమ్మల్ని పోరాటం చెయ్యమంది
సంకెళ్ళు వేసిన స్వేచ్చకు స్వాతంత్ర్యం ఇచ్చింది
నువ్వు నడిచి వెళ్ళిన ఈ దారిలో
గాలి దైర్యంగా వీస్తుంది
నీళ్ళు నవ్వుతున్నాయి
మా  చాతీ గర్వంతో ఉప్పొంగింది
ఇప్పుడు సెలయేరు పరుగెడుతుంది
నెమళ్ళు ఆడుతున్నాయి
లేళ్ళు దూకుతున్నాయి
పులులు పరిగెడుతున్నాయి
నువ్వు ఎప్పటికీ విశ్వనాయకుడివే
ప్రపంచానికి  స్పూర్తిదాయకుడివే

శిశిర రాగం

గడిచిపోయిన కాలాల పాటలలో ఒక శిశిరరాగం మిగిలిపోయింది
గతించిన చీకటి గదిలో ఒక కోయులరాగం మూగబోయింది
విషాదాల అంచులు దాటని ప్రేమను తన గొంతులోనే నొక్కేస్తుంది

ఓ నా మనసా ! ఇంకా నువ్వు ఆ జ్ఞాపకాలలో మిగిలిపోయావా

ఒక ఆత్మాంకిత గానం కలలా నీ కళ్లలో ధ్వనిస్తోంది
తంత్రులు తెగిపోయినా వీణ పాడుతూనే ఉంది
తెగిపడిన చెట్టు కొమ్మ చెట్టు గంధాన్నే స్రవిస్తోంది

పక్షి తనకు తానే పంజారానికి వచ్చి బందీ అయ్యింది
రెక్కలను తెంచుకొని నిస్సహాయంగా ఒరిగింది
కలలన్నిటిని కరిగించి కన్నీరు చేసుకుంది

ఆ కన్నీటి శిశిర రాగం అలా ఆకు అకునా రాలుతూనే ఉంది
ప్రతి చీకటిలో కోయిల మౌనరాగమై వినిపిస్తూనే ఉంది
ప్రేమను విషాదం అంచులు దాటకుండా ముంచుతూనే ఉంది
మనసు జ్ఞాపకాల సుడి గుండంలో అలా మిగిలిపోయింది

2, సెప్టెంబర్ 2013, సోమవారం

ప్రేమాలయం

ప్రియా నీ వదనం
నీ నయనం
నీ స్వరం అన్ని గుర్తున్నాయి ప్రియా
నువ్వు చేతులు చాచి మొదటి సారరి
నన్ను పిలిచిన క్షణం
అలా గుర్తుండి పోయింది ప్రియా

నీ కేశాల మీదుగా వీచిన గాలి
సువాసన, ఈ తోటలో ఇంకా నిలిచే ఉంది
ఈ నీలి సముద్రపు హోరులో
నువ్వు పిలిచిన పిలుపు
ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది

నువ్వు నవ్విన నవ్వు అలా
సముద్రం మీదుగా ఉదయుంచే సూర్యుడులా
నాకు దిశానిర్దేశం చేస్తూనే ఉంది
అందుకే నా గతాన్ని సముద్రంలో వదిలేసి
నీ కోసం పయనిస్తున్నా ప్రియా

నా హృదయం నాకు చెప్తుంది ప్రియా
విశ్వమంత ప్రేమను , అణువంత గా మార్చి
నువ్వు నాకివ్వగలవని
ఈ కరుగుతున్న ఇసుక సాక్షిగా
నా ఆశల కోటను , నీ ప్రేమ సామ్రాజ్యంలో
పదిలంగా ఉంచగలవని.

నా కల నాకు చెప్తుంది ప్రియా
నేను నీకొక ప్రేమాలయాన్ని
నా స్వహస్తాలతో నిర్మిస్తానని
అక్కడ నీ హృదయరాధన చేస్తానని
అ కల కోసమే నేను జీవిస్తున్నా ప్రియా

31, ఆగస్టు 2013, శనివారం

సందిగ్దాలవాకిలి

మనం కలిసిన క్షణాలకోసం
నేనంత ఆతృతగా చూశానో
నీ కళ్ళలో కన్పించే అనురాగాన్ని
ఎంతగా ఆరాధించానో
ఆ అనురాగంతో మన జీవన శృతి లయలు
పాడదామని ఎంతగా కోరుకున్నానో
అన్ని కరిగిపోయాయి
విడిపోయిన విషాదం
మనల్నెంతగా పెనవేసిందో చూశావా
నీ విషాదాశృవులను నా కళ్ళు
రాలుస్తూనే ఉన్నాయి
మన కలయికలు, జ్ఞాపకాలు
దాని కోసం మనం పడిన
అతృతలు, అన్నీ అబద్దాలే
ఈ బాధ, ఈ చేదు విషం
అలముకున్న చీకటి
దాన్నంటుకున్న అగ్ని
అది చేసే గాయాలు
ఇవి మాత్రమే నిజాలు
ఈ బాధ మన ఇద్దరిలో ఎవరి ఎంపికో తెలియదు
ఎక్కడ , ఎందుకు ప్రారంభం అయ్యిందో తెలియదు
తప్పు నీ కళ్ళలో నాకు కనిపించిన అనురాగానిదా
నా కళ్ళలో రాలిన నీ విషాదాశృవుదా ! ఎవరిదైనా
ఇద్దరినీ కాల్చేస్తూనే ఉందే.
ఏమైనా, ఎంత బాధ ఉన్నా
నిన్ను మరిచిపోను ప్రియా.
నువ్వు నాకు పంచిన ప్రేమ,
నా కంటిపువ్వులో దాచుకున్న నీ నవ్వులు
మొక్కనుండి రాలిన వాడిపోని కుసుమాలు
సరే ! అవన్నీ వదిలెయ్యి ప్రియా
నువ్వు నిజం చెప్పు ఇప్పుడు
నీ హృదయ సాక్షిగా నన్ను వెళ్లిపొమ్మని,
మన ప్రణయం ముగిసిపోయిన పుస్తకమని.
అ క్షణమే, నా హృదయం నిన్ను
మర్చిపోతుంది,
పుస్తకం మూత బడుతుంది
మనది హృదయానుబంధం ప్రియా
నా హృదయం వినేది నీ హృదయ స్పందన మాత్రమే
చెప్పగలవా ప్రియా , నీ ఆలోచనతో కాక
హృదయం తో చెప్పగలవా ప్రియా
ఇప్పటికీ నువ్వు చెప్పగలిగే క్షణాల కోసం
సందిగ్దాల వాకిలిలో ఎదురుచూస్తున్నా ప్రియా

26, ఆగస్టు 2013, సోమవారం

అన్నయ్య

అన్నయ్యా ! రా ఒక్క సారి కౌగిలించుకుందాం
మనిద్దరి మధ్య రాజకీయ కౌరవుల కళ్ళు పడ్డాయ్
తగవులు పెడుతున్నారు, తన్నుకు చావమంటున్నారు
వాళ్ళకేమి తెలుసు అన్నా
మన ఇద్దరివి తనువులు మాత్రమే వేరని
తన్నుకుంటే దెబ్బతినేది మన మనసులేనని
మన ఇద్దరం కలిసే చూశాం కదా
ఆవకాయను , బిర్యాని ని కలిపి తీసిన
ఆవకాయ బిర్యానిని, కలిపిన అనీష్ కురువిల్లా సినిమాని
కోనసీమ కోడిపుంజు బలం కోసం
తీసుకెళ్ళిన తెలంగాణా సర్వపిండి ముద్ద.
గుంటూరు గోంగూరతో పాలమూరు పోటేలుని
కలిపి తిన్న మటన్ గోంగూర.
వరంగల్ కారం కన్నా, గుంటూరు మమ "కారం"
ఎక్కువని కడుపు పట్టుకొని నవ్వుకున్న రోజు.
బతుకమ్మ వైజాగ్ బీచ్ లో చెయ్యాలని,
అట్లతద్దికి ట్యాంక్ బండ మీద ఉయ్యాలూగాలని
ఉందంటూ ఆశ పడ్డ మెదక్ రేణుక కి
కడప చక్రి గాడితో అన్నవరంలో చేసిన దొంగ పెళ్ళి.
వీటిలో ఏది నీది, ఏది నాది అన్నా !
ఇవన్నీ మనవే కదా,
తిరుపతిలో, చిలుకూరులో, చిన్నతిరుపతిలో
మూడు చోట్ల ఉంది వెంకన్నే కదా
సింహాచలం, అహోబిలం, యాద్గిరి గుట్ట
వీటిలో నృసింహుడు ఎక్కడలేడన్నా !
కాదు కాదు అని అరుస్తున్నాయన్నా
ఈ రాజకీయ రాబందులు
వాటి ఆహారం కోసం మనల్ని చంపి తినాలన్న ఆశ
ఇప్పటికే వెయ్యి శవాలపైనే తిన్నఆకలి తీరని రాబందుల మూక
అందుకే అన్నా ! కోస్తానుండి తెలంగాణా దాకా
పెద్ద తుఫాను సృష్టిద్దాం, ఈ రాబందుల రెక్కలిరుద్దాం

6, ఆగస్టు 2013, మంగళవారం

మొదటి ప్రేమలేఖ



ఇది నేను నీకు మొదటి సారి రాసిన ప్రేమలేఖ
నీకివ్వలేక ఆగిపోయిన ప్రేమలేఖ
ఎవరికంటా కనపడకుండా అల్మరా
మూలలో దాచుకున్న ప్లేబోయ్
పుస్తకపు లోపలి పేజిలలో
పదిలంగా దాచుకున్న లేఖ
మాధురీ దీక్షిత్ మందహాసాన్ని
మరిపింప చేసిన లేఖ
మడొన్నా పాటను అలవోకగా
పాడేసిన లేఖ
మధుశాలను మర్చిపోయేలా చేసిన
మధురమైన లేఖ
మనం మాటలతోనే కలిశాకా
లేఖ తో పనిలేదని, మరచిపోయిన
నా మొదటి ప్రేమలేఖ
నువ్వు మొదటి సారి నాతో
గొడవపడి వెళ్లాక నీ కోసం
మళ్ళీ నన్ను పంపిన లేఖ
నిన్ను నాకు ఎప్పుడూ
సరికొత్తగా పరిచయం చేసే లేఖ
నా బాధను నాకు దూరం చేసే లేఖ
నిన్ను అనుక్షణం నాకు దగ్గర చేసే లేఖ
పదిహేడళ్ళ వయసులో నేను రాసుకున్న లేఖ
వందేళ్ళ వరకు నాకు తోడు వచ్చే లేఖ
దానిలో నేను నింపినవి మాటలు కాదు
నా హృదయం చేసిన స్పందనలు
నీ మదుర భావనలు
నీ నవ్వులు, నీ అందాలు
నీ అలకలు, కులుకులు
అన్ని నీవే,
నీతో పెనవేసుకున్న నావే
ఎంత చూసినా ఒక్కటైనా
ఋణాత్మక భావనలే లేవు
అన్ని ధనాత్మకమే
అందుకే నీతో గొడవ పడిన
ప్రతిసారి చదువుకుంటా
నీ మీద ప్రేమను రెట్టింపు చేసుకుంటూ
ఇది నేను నీకు ఎప్పటికీ ఇవ్వను
ఇది నాకు తిరుగులేని ప్రేమగని
నాతోనే పదిలంగా ఉంచుకుంటా
ఎప్పటికీ, ఎల్లప్పటికీ

ఈ రాత్రి

ఈ రాత్రి ఎప్పటికీ తెల్లవారదు
చీకటి దట్టంగా పేరుకుపోయింది
మనిషి లో స్వార్ధం లా.
ఆకాశం లో వెలుగు ఏ మూలనా లేదు
మరుగునబడ్డ మానవత్వంలా.
గాలి కూడా ఊళలు వేస్తుంది
మనిషిలోని వికృత విన్యాసాలకు తాళం వేస్తూ.
సమాజం చలనం కోల్పోయి
శాశ్వత నిద్ర పోతోంది  శవంలా.

దాన్ని మోసుకొచ్చారు  నలుగురు కొడుకులు, 
వాళ్ళేనట ప్రజాస్వామ్య మూల స్తంభాలు.
ఇప్పుడే తగలబెట్టాలి ఆ శవాన్ని
జరిపించాలి అరాచక సమాజపు అంత్యక్రియలు
తెల్లవారితే ఇక ఆ శవం తగలబడదు
అంతా చీకట్లో నే జరగాలి

అందుకే చీకటి దట్టంగా పేరుస్తున్నాడు మనిషి
శవం పూర్తిగా తగలబడేదాక రాత్రి తెల్లవారదు
తెల్లవారితే మళ్ళీ మనిషి కనబడడు.


4, ఆగస్టు 2013, ఆదివారం

కాకులం

ఎవరికి కావాల్సింది వారు తెచ్చుకుంటున్నారు
ఎవరి పదవి వాళ్ళు కొనుక్కుంటున్నారు
మీ అందరికి  పదవులు లేవని
కొత్త పదవులు పెట్టుకుంటున్నారు
అంతా మీరే ! అదికారం మీదే
అధికారులు మీరే
దొరలు మీరే ! దోపిడీలు మీవే
మరి
మేమవ్వరం
వట్టి ప్రజలమా
ఓటుకు తప్ప దేనికి
పనికి రాని వాజమ్మలమా
సిక్కోలు బీల లో దిగులు బడ్డది మేమే
కాకినాడ పెట్రో కారిడార్ లో తగలబడ్డది మేమే
ఒంగోలు వాన్ పిక్కులో కూలబడ్డది మేమే
అనంతపురం లో చుక్క నీరు చూడనిది మేమే
పాలమూరులో బతుకులేక గల్ఫ్ న బడ్డది మేమే
కరీంనగర్ లో కడుపునిండక ముంబై పాలబడ్డది మేమే
మాకెప్పుడూ గవర్నెమెంట్ దూరమేనయ్యా
అది మా మాట దూర్చుకోదయ్యా
ఇప్పుడేదో కొత్త పెభుత్వం వస్తదంటున్నారు కదయ్యా
మా బతుకులు మారతాయా అయ్యా !
మా కష్టాలు తీరతాయా అయ్యా !
అయ్యా ! అదే యమ్.ఆర్.ఒ ఉంటాడా అయ్యా !
అదే కలెక్తేరా అయ్యా !
మరి పెభుత్వం మారిందంటారేందయ్యా !
వారి బుద్ది మారకుండా ఏ పెభుత్వం అయితే ఏందయ్యా
నల్ల కుక్క, కాకపోతే తెల్ల కుక్క
కుక్క బుద్ది ఒకటే అయ్యా !
మారాల్సింది మనిషి కాదయ్యా ! ఆడి బుద్ది
అది మారకుండా ఎన్ని మారితే ఏముందయ్యా
ఎన్నాళ్ళిట్టా ఏమారుత్తారయ్యా !
మారండయ్యా ! మీరు మారండయ్యా
ఎంగిళి ఇస్తర్ల కొట్టుకుంది చాలయ్యా
మేము మాత్రం కాకులమే అయ్యా
ఉందే పంచుకొని తింటాం
సిక్కోలు నుండి పాలమూరు దాకా
మా అందరిది కాకి బతుకులేనయ్యా





ప్రతిధ్వని

ఎందుకీ ఖాళీతనం
ఎందుకీ బేలతనం
చుట్టూ అందరున్నా
ఎందుకీ ఒంటరి తనం
ఎలా అలవడింది
ఈ సామాహిక ఏకాంతం.
అందరూ నీ చుట్టూ తిరుగుతునే
ఉన్నారు కదా, ఎవరి ఒంటరి తనపు
బరువును వారి వీపున మోస్తూ.
నీ వీపు మీదున్న బరువు
మొయ్యలేక, చేయూత కోసం
ఒక్కసారిగా సమాజం లోకి
వచ్చిన ఓ  మానవ యంత్రమా
సమాజం అంటే ఏమనుకున్నావు
నీకోసం చూస్తుందనుకున్నావా
దాని ధోరణి దానిది,
నిన్ను ఆహ్వానించదు
నిన్ను తిరస్కరించదు,
అసలు నీ ఉనికే గుర్తించదు
నీ ఉనికి దానికి తెలియాలంటే
నీ మాటలు కావాలి, నీ పలకరింపు కావాలి
నీ ఆత్మీయ హస్తం కావాలి
అప్పుడు చూస్తుంది సమాజం
అప్పుడు మాట్లాడుతుంది సమాజం
శబ్దం చెయ్యకుండా ప్రతిద్వనిని ఆశించే
మిత్రమా ! ముందు నువ్వు నీ శక్తి కొద్ది అరువు
అప్పుడు సమాజం ప్రతిధ్వనిస్తుంది నీ కేకకు
తోడుగా పలు కేకలై ,నీకు తోడు నిలుస్తుంది.
ప్రతి వ్యక్తి తన బరువు ని దించుకుంటాడు
ప్రక్క బరువు ను కూడా తేలికగా మోస్తాడు
అందుకే నీతో నువ్వు మాట్లాడకు
ప్రక్క వ్యక్తి తో మాట్లాడు
సమాజంతో మాట్లాడు
పెద్దగా, మరింత పెద్దగా
దిక్కులు ధ్వనించేలా
ప్రతిధ్వని  వినిపించేలా

30, జులై 2013, మంగళవారం

గరుడపక్షికన్ను

ఉద్యమం నీది, విద్యుక్త ధర్మం నీది
విప్లవకారుడా నవ్వెప్పుడూ
ఎత్తులోనే ఉంటావు,
గగన సీమలోనే విహరిస్తావు
నీదంతా గరుడ పక్షి కన్నే
ఎత్తునుండి నేలను చూస్తావు
దూరతీరాలనూ గమనిస్తావు
భవిష్యత్తును నిర్దేశిస్తావు
ఇప్పుడు, నా కాళ్ళ మీద
నేను నిలబడాలి, దానికి
నేను నిరంతర పోరాటం చెయ్యాలి
దగా పడ్డ సమాజం, మానవ
నాగరికతకు నవీనం ఏమి కాదు
ప్రతి తరంలోనూ అలవాటైన విధానమే
ఎన్నో సార్లు దారి మార్చుకున్నా
వదుల్చుకోలేని సహజ వ్యసనం
ఈ దోపిడి నైజం.
అందుకే
కలల కోసం పోరాడాలి
కలలను కళ్లలో వేసుకొని కాపాడాలి
అదే విప్లవం, అదే ఉద్యమం
అదే పోరాటం, అదే ఆరాటం
నీకు ఎప్పుడూ శత్రువు ఉంటాడు
మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు
నీ చివరి గాయం నుండి స్రవించే
రక్తంలో మళ్ళీ ఉద్యమం పుట్టాలి
గరుడ పక్షి కంటితో భవిష్యత్తును చూడాలి
పోరాటాన్ని నిర్దేశించాలి

24, జులై 2013, బుధవారం

అన్నీకలలు

నగరం, మహా నగరం
ప్రతినిత్యం అవే ముఖాలు
పెదవుల పై నవ్వు పులుముకుంటూ
కళ్ళలో దిగులు దాచుకుంటూ.
ప్రతినిత్యం అవే కూడళ్ళు
పరిగెత్తే వాహనాల చూసుకుంటూ
అవిరేపే దుమ్ము పేరుకుంటూ.
మరో ఉదయాన్ని భుజాన వేసుకొని
కదలికలేని కలల పరుగు పందెంలో
ముందుకు సాగే నగరం
ఎక్కడికీ కదలదు
ఎప్పటికీ కదలదు
కదలలేనని తెలిసాకా కారే కన్నీరు
రహదారి చెంపలపై రాలి
రాళ్ళను మొలిపిస్తున్నాయి
బ్రతుకు బండి కి బ్రేకులేస్తూ.
తలను వీధి చివరున్న నాయకుడి విగ్రహం
కాళ్ల దగ్గర పెట్టి ముడుచుకు పడుకున్న
చింకి పాతరను చీల్చుకొని బయటకు వస్తున్న ఆకలిని
కప్పి పుచ్చుతున్న విగ్రహానికి వేసిన పూలదండల సువాసన
తాను కన్న కలలలో తను చనిపోతున్న కలే, అందంగా ఉన్న భావన
ఆ కలను నిజం చెయ్యమని వీధికి ఆ చివర ఉన్న ప్రార్ధనాలయంలో ప్రార్ధన
తిరిగి రాత్రి పూర్తి కాగానే, మరో ఉదయాన్ని భుజాన వేసుకొని
ముందుకు సాగే అనంత జీవన యాత్ర
చుట్టూ ఎప్పుడూ అవే ముఖాలు, అవే కూడళ్ళు
అవే నవ్వులు, వాహనాలు, దిగులు, దుమ్ము
అన్నీ నీ కలలు
అదే నగరం ,మహా నగరం

22, జులై 2013, సోమవారం

వదిలివెళ్ళకు



ప్రియా ! నన్ను ఈ వర్షంలో వదిలి వెళ్ళకు
ఈ అంతులేని చీకటి రాత్రుల వెంట నే వెళ్ళలేను
నా నవ్వుల మెరుపులను నాకు తిరిగివ్వు
ఈ కన్నీటి వర్షంలో నేను పూర్తిగా తడిసిపోయాను
నాకు నీ చెయ్యి కావాలి, ఈ కన్నీటి వర్షాన్ని
ఆపే నీ చెయ్యి కావాలి,
ఈ వర్షపు ముసురు చీకటి రాత్రులు నాకొద్దు
మనం కలిసి ఊసులాడిన వెచ్చటి వెన్నెల రాత్రులు కావాలి
నీవు నా నుండి వెళుతూ తెరిచి వెళ్ళిన తలుపుల
ఖాళీ నుండి వీచే చల్లటి గాలి నా శరీరాన్ని
నిలువెల్లా కోసేస్తుంది, నాకు నీ రాక కావాలి
నీ రాకతో ఆ తలుపు మూత పడాలి,
నీ కౌగిలి లో వెచ్చదనాన్ని నే తిరిగి పొందాలి
ఈ వర్షాకాలం నిజంగా పెద్ద రాకాసి దెయ్యం
నీవు లేని నా జీవితంకన్నాకూడా క్రూరమైనది
పదే పదే అదే గుర్తు చేసి ఒంటరిని చేసి మరీ చంపుతుంది
రా ప్రియా నీ చూపు కత్తులతో ఆ రాకాసిని చంపెయ్యి
నే ఒంటరిని కానని, నా జంట నువ్వని చెప్పు ఆ దెయ్యానికి
ఇక ఈ వర్షపు రాత్రిని ఒక్క క్షణం కూడా నే భరించలేను
కరకు మబ్బులే కరిగి నీరయ్యి వర్షమయ్యిందే
నువ్వు కరగావా ప్రియా , రా తిరిగి రా
నన్ను నీలో కరిగిపోనివ్వు ప్రియా

మిగిలేబూడిద

నేను చలి కాచుకుంటున్నాను
నా మునపటి కాలాన్నంత
చితుకులుగా పేర్చి
తగలపెడుతున్న నెగడు వేడిలో
నేను చలికాచుకుంటున్నాను
పొగచూరిన ఈ రోజుసాక్షిగా
 నా రేపటినిఆవిరి చేసుకుంటున్నాను
కాల్చే కట్టె నాదే, కాలే కట్టెనాదే
మధ్యలోనే ఈ ఆశానిరాశల తుట్ట
అందుకే ఆశలను తగలబెడుతున్నాను
నిరాశలను ఆవిరి చేస్తున్నాను
నేనిప్పుడు స్వేచ్చాజీవిని
కాలిన కట్టెలు రాల్చిన బూడిదని
నిరాకారుడిని,
అనుబంధాలు లేవు.
కర్బన బంధాలున్నాయి చూడు
నే మిగిల్చివెళ్ళిన బొగ్గులో.
అ బొగ్గుతో నీ చిత్రం గీసుకో
చిత్రంగా నాలాగే ఉంటుంది
నా బ్రతుకులాగే ఉంటుంది
మరోసారి మిగిలిపోయే బొగ్గులా
దానికి ముందు ఉండే నిప్పుతో
మరో వెలుగు పుడుతుంది
వెలుగు కాలాన్నికాల్చుకుంటూ
బూడిదను రాలుస్తుంటుంది

15, జులై 2013, సోమవారం

వేలంపాట

ఎన్నికలు ఎన్నెన్నో కలలు
ఇంకొన్ని వరాలు
మరెన్ని వివరాలు
మరి కొన్ని వివాదాలు
వెరసి మాసం పాటు వినోదాలు
ఖద్దరు వన్నె నాయకులు
భలే భలే గిరాకీలు
చీరసారెలు, క్రికెట్ కిట్లు
కుంకుంభరిణలు
సెల్లుపోనులు
మందు సీసాలు
దేవాలయానికి చందాలు
చర్చి నిర్మాణాలు
ఇప్పుడు మేమడిగింది మాకివ్వండి
ఆ తర్వాత మీక్కావాల్సిందంతా
మమ్మల్నడగకుండానే తీసుకోండి
అంతా క్విడ్, ప్రో, కో నే
నాక్కావాల్సింది నాకు దక్కింది
నీక్కావాల్సింది, నాదగ్గర ఉంది
అందుకే అందుకో మా ఓటు హక్కు
అందలం ఎక్కు, అందరం అమ్ముకుంటున్నాం
నాక్కావాల్సింది నాకు దక్కింది
ఎవరి వాటా వారిది
తిలాపాపం తలా పిడికెడు
అందరం పంచుకుందాం
కాకపోతే మీకు కేకు
మాకు ఖాళీ ప్లేటు
ఏదైతేనేం దక్కింది కదా
అది చాలు
నువ్వు తినేది నువ్వు తిను
తిన్నాకా కొద్దిగా చెయ్యి విదుల్చు
అది చాలు మా తరం మొత్తానికి
ఆకలి తీరటానికి,
కాని నువ్వేంటో
కాకులను కూడా విదిల్చవు
కనీసం కడుక్కుంటావో లేదో
అందుకే
నీక్కావాల్సింది నా దగ్గరుంది
దాని రేటు పెరిగింది
ఓటు కు వేలంపాట
మొదలయ్యింది
ఎవరి రేటుక్కువయితే వాడికే ఓటు

11, జులై 2013, గురువారం

ఎవరునువ్వు

ఎవరు నువ్వు ?
హిందువువా ? ముస్లింవా ? క్రైస్తవుడివా ? ఏ మతం ?
అగ్రకులం వాడివా ? నిమ్న కులం వాడివా ? ఏ కులం ?
ఆంధ్రవాడివా ? తెలంగాణా వాడివా ? ఏ ప్రాంతం
ఉద్యోగివా ? నిరుద్యోగివా? చిరుద్యోగివా ? ఏం చేస్తావు
నువ్వు ఖచ్చితంగా మనిషివైతే కావు
ఇక్కడ మనుషులెవరు లేరు
ముసుగులు తప్ప,
అందుకే ఏదో ఒక ముసుగు తొడుక్కో
ఏ ముసుగు లేదా ?
అయితే నువ్విక్కడ ఉండొద్దు
ఇక్కడ ముసుగులేక ప్రవేశం లేదు
ప్రవేశంతోనే ఏదో ఒక ముసుగు తప్పదు
చీకటి గర్బం నుండి బయటకు రాగానే
మరో చీకటి ముసుగువేసుకోక తప్పదు
వెలుతురు తట్టుకోలేవు మరి
ఉండిపో ! చీకట్లో ! ముసుగులో !
నీ ముసుగు నువ్వు కూడా ఎంచుకోలేవు
నీ పుట్టుకే ఎంచి మరీ ఇస్తుంది ఓ మంచి మసుగు
అయినా బుద్దిజీవి నంటావు,
నీ ముసుగు తీసుకోవటం రాదు
బుద్దిలేదూ చెప్పుకోవటానికి బుద్ది జీవినని
బుద్దిలేని బుద్ద జీవివి
ముసుగు అద్దంలో చూసుకొని
నువ్వెవరో చెప్పు
నేను లెక్కరాసుకోవాలి

6, జులై 2013, శనివారం

శాశ్వతంగా మర్చిపో


నాకు నీ నవ్వుల కాంతిని దూరం చేసిన
ఈ సాయంత్రపు చీకటిని
మరువలేను ప్రియా
అది నిజమని తెలిసినా
నమ్మలేను ప్రియా
నువ్వు నవ్వుతూ వెళ్తున్నానంటున్నావు కదూ
ఒక్క సారి నీ కళ్లలోకి నువ్వే సూటిగా చూసి అడుగు
అక్కడ నీ కళ్లల్లో  నా గుండెలోని కన్నీటి సముద్రాలు నీకే కన్పిస్తాయి
నాకు తెలుసు నాకున్న రేపులో నీవు లేవని
నాకు ఇక విషాదాలు తప్ప అనందాలు లేవని
విషాదాన్ని అనందంగా ప్రేమించటం నేర్చుకోవాలి
నువ్వు విడిచివెళ్ళాక ఇక నేను వాటితోనే సావాసం చెయ్యాలి
ఇక జీవం లేని జీవితాన్ని బ్రతకటానికలవాటు పడాలి
పర్వాలేదులే ! ఎదురుచూపులు, ఎదురు దెబ్బలు అలవాటేలే
కానీ, కానీ ప్రియా !
నా వేదన అది కాదు ప్రియా
ఇక రేపటి నుండి నీ స్వచ్చమైన కళ్ళు నన్ను దూరం చేసుకున్న
విషాద భావాన్ని ఎలా భరిస్తాయి
నన్ను దూరం చేసుకొని నీవు నడిచే నడకలో భారాన్ని ఎలా మోస్తాయి
ప్రియా ! నన్ను శాశ్వతంగా, తిరిగి ఎప్పటికీ గుర్తు రానంతగా
ఈ ఒక్క రాత్రిలో మర్చిపో ప్రియా
తిరిగి రేపు ఉదయం నా ఉనికి కూడా నీకు తెలియనంతగా మర్చిపో
నా జ్ఞాపకాలు నిన్ను బాధపడితే ఆ విషాదాన్ని నేను తట్టుకోలేను ప్రియా
అందుకే మర్చిపో ! శాశ్వతంగా మర్చిపో

1, జులై 2013, సోమవారం

ఆకాశాన్నై

ప్రియా ! ఉదయపు వెలుగులాంటి నీ కోసం
ఈ రాత్రంతా నా ప్రయాణం అకాశమై సాగనీ,
అదిగో ఆ నక్షత్రం దారి చూపిస్తుంది
నాతో పాటే పయనం సాగిస్తోంది,
నా అలసటను పంచుకుంటూ.
అదుగో అక్కడెక్కడో దూరానా
ఉషాకాంతుల  సవ్వడి
ప్రియా ! నీ నులివెచ్చని కిరణాన్ని
తనివి తీరాఒక్కసారి తాకలనుంది,
ఒక్కసారి నా స్పర్శలో తెలుస్తుంది
నీ రాక కోసం వేచి చూసి చూసి
నేనెంత ఘనీభవించానో.
నేనీ ఉదయరాగాన్ని  చెవులారా
వింటున్నా, ఎన్ని సార్లు విన్నా
విసుగు పుట్టని నీ నడకల సవ్వడి,
దాన్ని తాకుతూ వచ్చే సుగంధ పువ్వుల
పుప్పొడి వాసన....
దాని కోసమే కదా  నేనీ నిశినంతా నాతో మోసేది,
కాని ఎందుకో!  నువ్వు చేరగానే
నా తనువంతా సిగ్గుతో ఎఱబడుతుంది
అది మన ప్రేమ కెంజాయ రంగే కదూ.
నిన్ను చూడక రాత్రంతా ఉబికిన
నా కన్నీళ్ళలో తడిచిన అ గులాబీ చూడు
నీ రాకతో నా కన్నీళ్ళను తిరిగి నాకిచ్చేస్తూ
ఎంత అందంగా నవ్వుతుందో
ఇక ఇప్పుడు విప్పారుతుంది,
అచ్చు నీ ప్రేమ లాగానే.
ప్రియా అసలు మన ప్రేమ
రాత్రి  నా కళ్ళనుండి
జారిన కన్నీళ్ళంత స్వచ్చం
ఎందుకో తెలుసా!
మరో పూటలో నువ్వు, నేను
ఒకరినుండి మరొకరు
విడివడుతామని
ముందే తెలిసినా
ప్రతి నిత్యం
నీ రాక కోసం
నేనెదురు చూస్తూనే ఉంటాను
ఎప్పటికీ నిలిచే ఆకాశమై



27, జూన్ 2013, గురువారం

పైకి..పైపైకి

ఎక్కడో రంగురంగుల ఇంద్ర ధనస్సు
మీదుగా నా కళ్ళు నీ కోసం
అన్వేషిస్తున్నాయి
ఆ ఏడు రంగుల కన్నా
ఎత్తులో నీలా నీలాల ఆకాశం
నీ ఎదురుగా అంతెత్తు ఎగిరి వచ్చిన నేను
నిజం నా కల నిజమయ్యింది
పద ఇంకా  ఇంకా ఎత్తుకు వెళదాం
అక్కడ
ఏదో ఒకరోజు నేను నక్షత్రాన్ని నీకిస్తాను
ఈ మేఘమాలలకు అందనెత్తు ఎత్తులో
అక్కడ ఎలాంటి ఆకర్షణలు ఉండవు
నువ్వు నేను శూన్యం తప్ప
అందుకే అక్కడ నా ప్రేమను
నిజాయితీగా నీకందిస్తాను
ఇంకా పైకి వెళ్దామా ప్రియా
అక్కడ మనతో
కృష్ణబిలాలు మాత్రమే ప్రియా
అవి,దేన్నైనా తనలో కలిపేసుకుంటాయట
నీ ప్రేమ కూడా అంతే
శూన్యాన్ని కూడా నువ్వు ప్రేమించగలవు కదా
ఇంకా పైకి వెళ్దామా ప్రియా
శూన్యాన్ని, దాన్ని కరిగించగల బిలాల్ని
దాటుకుంటూ, ఇంకా ...ఇంకా...ఇంకా
అలా అన్నిటిని దాటుకుంటూ
నువ్వు నేను తప్ప శూన్యం, ప్రపూర్ణం
అసలు సృష్టిలో నిర్వచనాలకందే
ఎలాంటి మూలకాలు లేని
ఒకానొక స్థితిలోకి

26, జూన్ 2013, బుధవారం

సమాధిచందాలు

ఏయ్ శరభ శరభ
నీకో శవం నాకో శవం
పంచుకుందాం శవాల్ని
అని అనుకున్నాం కదా
లెక్కల్లో తేడా తీసుకొస్తావా
ఖబడ్డార్ ! కొడకా
నా శవాన్ని లాక్కుపోతావా
ఏం నీ శవాలు నీకులేవా
సరే ! గొడవెందుకు
రా ! శవాల మీద పేలాలేరుకుందాం
చిల్లర పంచుకుందాం
ఎవరు చచ్చినా మనకేంటి
మనం మన ఓట్ల పండుగ చేసుకుందాం
దానికి ఈ శవాలను
చందాలడుగుదాం
చాలినన్ని శవాలు లేకుంటే
మనమే సజీవ సమాధి చేసేద్దాం
సమాధులకు పసుపు రంగో
మూడు రంగులో
కాషాయ రంగో
ఏదో ఒక రంగేద్దాం
అన్నట్టు బాబూ !
అయ్యా !  మానవత్వానికి
సమాధులు కట్టాలి
మీ ఓట్ల చందాలివ్వండి
రాబందులు అంతరించాయని
ఎవరన్నారు మీతో, అవి
రాజకీయపు చొక్కావేసుకొని
మాలాంటి పెద్దమనుషుల రూపంలో
తిరుగుతునే ఉన్నాయి కదా
దోపిడీలు చెయ్యటానికి
ధగ్గులో, పాండాలో కావాలా !
మాలాంటి నాయక శిఖామణులు లేరా
ప్రజలారా ! భయపడకండి
మేమేమి మిమ్మల్ని చంపం
మాకు మీ ప్రాణాలు వద్దులే
రక్తమాంసాలు చాలు
మీరేసే ఓట్లు చాలు
ఒట్టు ! తర్వాత మీ జోలికి
అస్సలు రాము,
మళ్ళీ ఓటు అవసరం వచ్చేదాకా
అప్పుడు కావాలంటే మళ్ళీ
సమాధులు కడతాం
మీరు చందాలివ్వండి చాలు
అయినా మీరందరూ బ్రతికున్న శవాలే కదా
మీకు సమాధులు మేము కట్టాలి కదా
రండి రండి చందాలివ్వండి
చందాలిచ్చి చచ్చిపొండి

25, జూన్ 2013, మంగళవారం

ప్రకృతిపురుషుడు

సుస్వర,రాగ  తాళాలను సమ్మిళితం చేస్తూ
ఎంత అందమైన పాట పాడుతోందో చూడు ఈ వర్షం
అచ్చు మన ఇరువురిని కలిపి ఒకే
యుగళగీతంలా చేసిన గుండె లయలా

భూమ్యాకాశాలను వాన దారాలతో
కలిపి కుట్టేస్తూ ఎంత అందమైన
దుస్తులు నేస్తుందో చూడు ప్రకృతి
అచ్చు మన ఇద్దరిని వలపు దారాలతో
కలిపి కుట్టిన మనసు దుస్తులమెరుపులా

వంగపువ్వు మొదలు బంతి పువ్వు తుదలు
ఏడుపూల రంగులని  కలిపి ప్రకృతి
కట్టిన కొత్త హరివిల్లు చూడు
అచ్చు మన ఇద్దరం జీవితాంతం
కలిసి నడిచే ఏడుజన్మల పొడవైన ఇంద్ర చాపంలా

సమస్త ప్రకృతి మన మధ్య సాంగత్యాన్నే చూస్తుంది
మన మధ్య ఇంకా దూరాన్ని హర్షించలేనంటుంది
నీలో నేను , నాలో నువ్వు
ప్రకృతి లో  పురుషుడిలా లీనమవుదాం
మరో సరికొత్త ప్రపంచాన్నే  సృష్టిద్దాం

22, జూన్ 2013, శనివారం

రుద్రభూమి

ప్రజలు ప్రకృతి ని నాశనం చేశారని
కన్నెర్ర  చేశావా పరమేశా
మూడో కన్ను తెరిచావా
అగ్నికీలల బదులుగా
వర్షకీలలు గా కురిశావా
అగ్నికీలలై అశరీరలైతే
నీ విలయాన్ని
గమనించలేమని
ఇంత పని చేశావా
ప్రళయ రుద్రా
చల్లబడిందా మూడో కన్ను
తప్పెవరు చేశారయ్యా
శిక్షెవరికయ్యా
భోళా శంకరయ్యా
బూడిదిచ్చేవాడివని తెలుసు కాని
బ్రతుకే నీటి బుగ్గిపాలు చేశావు కదయ్యా
శివయ్యా
కళేబరాలు మోస్తావని తెలుసు
కాని ఇన్ని కళేబరాలు అనుకోలేదయ్యా
పరమశివయ్యా
చితాభస్మం పూసుకుంటావని తెలుసు
కాని తల్లుల కుంకుమ పూసుకుంటావనుకోలేదయ్యా
జంగమయ్యా
స్మశానం లో తిరుగుతావని తెలుసు
కాని దేశాన్నే స్మశానం చేస్తావనుకోలేదయ్యా
రుద్రయ్యా
హాలాహాలం తాగుతావని తెలుసు
ఇంతమందిని జలంలో ముంచుతావనుకోలేదయ్యా
నీలకంఠయ్యా
అందరికీ దిక్కే నువ్వు కదయ్యా
ఇప్పుడు దిక్కొక్కరిని చేశావు కదయ్యా
దిగంబరయ్యా


అమ్మా ! తల్లి గంగమ్మా
తరతరాలుగా నువ్వే
కదమ్మా మా భరత జాతిమాతవి
నీ బిడ్డలనే నువ్వు బలికోరావా అమ్మా
అవునులే అమ్మా ! 

కన్న బిడ్డలను స్వయంగా చంపటం
నీకు భారతకాలం నుండి అలవాటేగా 
ఇప్పుడు అడ్డు చెప్పే శంతనవులు కూడా లేరు
బ్రతికి బట్టకట్టే భీష్ములు లేరు, 
ఉన్నదంతా  మాములు మనుషులే

అమ్మా పార్వతి మాతా
అమ్మలగన్న అమ్మవి

ముగ్గురమ్మల మూలపుటమ్మవి
అంటే నీకు ప్రేమ మూడింతలు ఉండాలి కదమ్మా
ఎందుకమ్మా, మామీద కక్ష
పుణ్యమే చేశామో, పాపమే చేశామో
నిన్ను చూసినంతనే పాపాలు తొలుగుతాయంటారే
నువ్వేంటమ్మా ప్రాణాలు తొలిగించావు
మట్టి బొమ్మ కు ప్రాణం పోతేనే తట్టుకోలేకపోయావే
ఇప్పుడు ఇంతమందిని మట్టికింద వేసి చంపావు కదమ్మా

ఇప్పుడెవరికి చెప్పుకోవాలి కష్టం
అమ్మా, నాన్న లే చిదిమేస్తే  ప్రాణం






21, జూన్ 2013, శుక్రవారం

వర్షంసాక్షిగా

వర్షం కురుస్తూనే ఉంది, నా శరీరాన్ని తడుపుతూ,
నన్ను కప్పుతూ నువ్విచ్చిన  వెచ్చటి కౌగిళ్ళ
గొడుగును దాటుకుంటూ,
ఆ చినుకులు కురుస్తూనే ఉన్నాయి,
నన్ను నిలువెల్లా తడిపేస్తూ.


అందుకే నేను నీ తో మాట్లాడాలి
నువ్విచ్చిన కౌగిలి సరిపోలేదని చెప్పాలి
నువ్వేమో అటుతిరిగి కూర్చున్నావు
నా మీద అలకతో
అందుకే నేను తడిచి వణుకుతున్నా
అయినా ఆ వర్షపు నీటి ముళ్ళు చేస్తున్న
గాయాలు నాకు నీ పై ప్రేమను తగ్గించలేవు కదా


ఈ క్షణమో, మరో క్షణమో నీవిటువైపు
తిరగగానే అవన్నీ నీ వెచ్చటి
శ్వాస కే అవిరవుతాయి కదా
ఇంకా వర్షం కురుస్తూనే ఉంది
నీమీదే నిలిపిన నా దృష్టి
వర్షానికి మసగ్గా మారుతుంది


అయినా ఈ వర్షం  మీద నాకెలాంటి
కోపం లేదు ప్రియా,
ఎందుకంటే నాకు తెలుసు
ఇది జారిపోయే మేఘమని
వర్షమే అన్ని కాలాల్లో ఉండదని


అయినా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది
నా దేహాన్ని చిద్రం చేస్తూ
నాకు తెలుసు నువ్వు ఏ క్షణమైనా
నా వైపు తిరుగుతావని
చూసిన మరుక్షణం నీ వెచ్చటి
కౌగిలి తో ఈ వర్ష మేఘం మొత్తాన్ని
ఆవిరి చేసేస్తావని


ఈ వర్షం సాక్షిగా
నీవు నా వైపు తిరిగేవరకు
నేను వేచిఉంటాను ప్రియా

20, జూన్ 2013, గురువారం

ఆ ఇల్లు

అందరి చూపు ఆ ఇంటి పైనే
రాగి చెట్టు, వేప చెట్టు
కలిసి ఉంటున్నాయక్కడ
రెండు కొమ్మలు ఎక్కడనుండో
ఎగిరివచ్చి, ఒకదానికొకటి
అంటు కట్టి పెరుగుతున్నాయి మరి
రోజు గుడి కెళ్తూ ఒక్క సారైనా
తొంగి చూసే రామశాస్త్రి
చర్చికెళ్తూ ఓరగా తెలిచిన తలుపు
చూస్తూ వెళ్ళే ఇమ్మానియేలు
మహిళామండలి మీటింగ్ కెళ్తూ
కళ్ళింత చేసుకొని చూసే శారదమ్మ
ఆఫీసు కెళ్తూ ఖచ్చితంగా అక్కడే
స్కూటర్ ఆగిపోయే జగన్నాధం
కాలేజ్ కెళ్తూ అక్కడికెళ్ళాక
బుక్స్ గుర్తువచ్చే సుధీర్
కూరగాయలకు వెళ్తూ, చెంగు చాటుగా
చూసే పక్కింటి మహేశ్వరి
కరుడు గట్టిన కమ్యూనిష్ట్ రంగారావు
పురుషుల మీద గర్జించే ఫెమినిస్ట్ అరుణక్క
ఒక్కరేమిటి
అందరికీ అదో వింతే
అక్కడ వేప చెట్టు, రాగి చెట్టు
కలిసే ఉంటున్నాయి
లేచిపోయెచ్చిన
కుంటి కాలేషా, అందాల కల్పవల్లి
కలిసి కాపురముండే ఇల్లు
అందరికీ కావాలి అ ఇంటి సంగతి
"అవును ! కల్పవల్లి ఉద్యోగం కూడా
చేస్తుందంట కదా , పక్కింటి
పిన్ని గారు చెప్పారు"
అయినా మనకెందుకులే!
"అసలు కాలేషాలో ఏమి చూసి వచ్చిందో
ఈ మహాతల్లి"
"అయన కాల్లు లేవు కదా !
ఇంట్లో నుండి బయటకే రాడు"
" ఈమె డబ్బులు బాగానే సంపాదిస్తుంది !
ఉద్యోగమే చేస్తుందో, ఇంకేమైనా చేస్తుందో
అయినా మనకెందుకులే
లేచిపోయొచ్చిన వాళ్ల గురించి"
"అయినా సంసారులుండే ఏరియా లో
ఇట్టాంటిదెప్పుడూ చూడలేదమ్మా"
"అయినా మగాడు బయటకెళ్ళకుండా
ఈమె బజారున పడి ఉద్యోగం చెయ్యటమేంటో"
"ఈమె చేసేది ఉద్యోగం కాదు
మొన్న ఒక రోజు కార్లో కూడా వచ్చింది"
ఇన్ని పెద్ద పెద్ద నిజాల మధ్య
ఆ ఇల్లు వాకిలి చిన్నదే అయినా
అప్పుడప్పుడు తొంగి చూస్తే
ఏమి కనపడుతుంది
ఆ జీవితాల్లోకి కొద్దిగా వంగి చూడండి కన్పిస్తుంది
ఎన్ని నీళ్ళున్నాయో ఆ కంటి బావిలో
అయినా మనకెందుకులే
తాగొచ్చి కొట్టే మొగుడు అయినా
వాడే బయటకెళ్ళి డబ్బులు తేవాలి

వృద్దవిద్యార్దులు

విద్యార్ధికి వృద్దాప్యం సోకింది.
పండుటాకులవుతున్నాయి
పసి శరీరాలు.
 
 గ్లోబల్ స్కూలింగ్ సోకి
వసంతం లేని విద్య
శిశిరమై
మోడువారుతుంది.

వీపున కన్న వారి
కలల సంచి
బరువు మొయ్యలేక
నడుములు కుంగుతున్నాయి.

ఉందో , లేదో తెలియని
భవిష్యత్తు వెలుగుల కోసమని
చీకటి కొట్ల ,పాఠ వధ్యశాలలో
వర్తమానాన్ని బలిచేస్తున్న చిన్నారులు
బాలకార్మికుల ఉత్పత్తిశాలలవుతున్న
విద్యాలయాలు.

పచ్చటి బాల్యాన్ని
టీచరామార్కులకు
తాకట్టు పెట్టి
రేపటి వృద్దాప్యాన్ని
ఈ రోజే కొని తెచ్చుకుంటున్న
విద్యార్ధుల , యధార్ధ, వ్యధార్ధ
దృశ్యాలు.

ఆత్మనూన్యతను తప్ప
ఆత్మగౌరవాన్ని పెంచలేని
ఈ తరం చదువుల చూసి
తల్లడిల్లుతున్న చదువుల తల్లులు.

మొక్కతోనే కాయలు
కాయించాలనే అలవి కాని
ఆశల కాండాన్ని మోస్తూ
ఒరుగుతున్న కన్న వృక్షాలు.
ఎవరి కోసమీ చదువులు
ఎందుకోసమీ ఎండమావులు

ఆలోచించకు

నేస్తం మనిషి గురించి ఆలోచించకు
ఎప్పటికీ అర్దంకాదు మనిషి నైజం
ఎప్పుడూ ఎదో ఒక ముసుగు
వేసుకోక తప్పని వైనం
తన సొంత ముఖాన్ని సమాజానికి
చూపించలేని దైన్యం
అసలు తను చూసిన
గుర్తు పట్టని ఖర్మం
బ్రతకటానికి ఒక వేషం
బ్రతికించటానికి మరో వేషం
ఎప్పుడో ఎవరో కప్పారు
నీ పై కప్పు
నీ ముఖాన్ని చూసే ధైర్యం లేక.
బహుశా ఇదే సమాజమేనేమో.
నీ చేతులు నువ్వు కట్టేసుకొని
నీ మేకప్పుని, పైకప్పుని
తొలగించుకోలేని నీ నిస్సహాయం
నీ చేతులు కట్టేసిన అను బంధాల
తాళ్ళని చూస్తూ  కన్నీరు
కార్చకు , నీ కంటికేసుకున్న
చీకటి కాటుక కరుగుతుంది
ముఖానికి వేసుకున్న
రంగు రంగుల మేకప్పు
పాడవుతుంది
పూర్తిగా  ముసుగు వేసుకో
ఎ.సి గాలికో ఫ్యాను గాలికో
అలవాటు పడ్డ ముఖానికి
అస్సలు అలవాటు లేని
చల్లగాలి తగులుతుంది
అందుకే ఎప్పుడూ
నిన్ను నువ్వు కూడా
చూడాలని ప్రయత్నించకు,
చూస్తే భయపడతావు
భయంతో సమాజాన్ని భయపెడతావు
మనది అసలే భయం లేని సమాజం
దాన్ని అది అద్దంలో చూసుకుంటే తప్ప
భయపడదు, అందుకే దాన్ని చూపద్దు
నువ్వు చూడొద్దు.
తియ్యకు ముసుగు, ఆలోచించకు
మనిషి గురించి

17, జూన్ 2013, సోమవారం

మృత్యుబేహారి

మా ఊరి రైతన్న
తొలకరి చూసి
ఆనందంతో రంకేశాడు
వాన పడుద్దని
పంట పండుద్దని
పాపం పిచ్చోడు
పంటకి విత్తులు
కావాలని మరిచాడు
ఏమి చేస్తావు రైతన్నా
నీకు కొత్తేమి కాదుకదా
ప్రతిఏడు జరిగే తంతే కదా
మరిచిపో, ఎప్పటిలాగే
సాగిపో, నీ సాగు నీదే

నీ చావు నీదే
నీ పాట్లు నీవే
నీ అగచాట్లు నీవే
నీ పంట మాత్రం నాకివ్వు
నా ఓట్ల పంట కు కొత్త ఎరువు కనిపెట్టాను
అందరికి ఆహార భద్రత అని

ఆ అందరిలో నువ్వు లేవు
అందుకే నీ పంట కావాలి, నా  ఓట్ల పంట కి
ఎరువుగా,
నీ పంట కు ఎరువు సంగతి నన్నడగకు
ఊర్లో షావుకారనడుగు వడ్డీకి అరువు ఇస్తాడు
కరువు రాదనే నమ్మకంతో ,
అలిసి సొలసి సొమ్మసిల్లి పోయే దాకా
పోరాడు, నువ్వు పోయాక
ఊర్లో సంతాప సభ పెడతాను,
ఆ సంతలో నీ చావు తో
మళ్ళీ ఓట్ల బేరం చేసుకోవచ్చు
నీ చావు సానుభూతి, నాకు
గుళ్ళో విభూతి, అందరికీ
తలా కాస్త పంచుతా, 

తిలా పుణ్యం తలా పిడికెడు
ఓట్ల పుణ్యం కావాలి కదా
పిచ్చోడా !
నీ చావైనా, బ్రతుకైనా,
పంటైనా, పాడైనా
కరువు అయినా, అరువు అయినా
ఏదైనా నాకు వ్యాపారమేరా
నేనెప్పుడూ మృత్యుబేహారినే
నువ్వెప్పుడూ అమాయకపు రైతువే
 

16, జూన్ 2013, ఆదివారం

బక్కోడు నవ్వాడు

బక్కోడు నవాడు
ఎందుకో తెలియదు బక్కోడు నవ్వాడు
పెద్దగా నవ్వాడు
కష్టపడి పెంచిన పైరు తాలు గింజలు రాల్చిందనా
రాలిన నాలుగ్గింజలు అమ్మితే కాటా ఖర్చులు కూడా రావనా
చదివించిన కొడుకు, ఉద్యోగంలేక తిరుగుతున్నాడనా
పెళ్ళిచేసి పంపిన కూతురికి అదనపు కట్నం ఇయ్యాలనా
తీసుకున్న పంట లోను కోసం బాంకోల్లు అడుగుతున్నారనా
తాకట్టు పెట్టిన తాళిబొట్టు లేక ఇంటిది పేరంటానికి పోలేదనా
పట్నం లో కూలికి పోయిన బామ్మర్ది కొత్త బండి మీద ఇంటికొచ్చాడనా
మనకు అర్దం కాకపోయినా నవ్వుతూనే ఉన్నాడు,
జేబులో ఉన్న రూపాయి మీద జాగ్రత్తగా చెయ్యివేసి
అప్పుడర్దమయ్యింది,
తనకు లాగే రూపాయి కూడా బక్కచిక్కిందని
తనకు లాగే రోజూ బక్కచిక్కే మరో నేస్తం దొరికిందని

12, జూన్ 2013, బుధవారం

కన్నీటి సముద్రం

నా కళ్ళలో 
కన్నీటి మేఘాలు కన్పిస్తున్నాయి.
నా హృదయం
అందులో తడిసిముద్దవుతుంది.
నా కళ్ళముందు
మనం గడిపిన సమయం
క్షణాల ముల్లై  తిరుగుతూ ఉంది.
కాని, మన దారులు
ఎందుకు విడిపోతున్నాయో
అర్దం కానే కాదు
నీ ఒడిలో పడుకొని
కాంతి పొందిన  నా కళ్ళు
ఇప్పుడు
ఆ వెలుగు రేఖల్లో నిన్నే వెతుకుతున్నాయి.
మనం కలిసి నడుస్తూ,
పూలు పూయించిన దారులన్నీ,
నన్ను  నువ్వెక్కడా అని ప్రశ్నిస్తూనే ఉన్నాయి.
మన ప్రేమ మొక్క
మనకు తెలియకుండానే
మన మధ్య మొగ్గ తొడిగింది,
అది పువ్వు అని సంబరంగా
అనుకొనే వేళ ,
పువ్వును కోసేసి వెళ్ళిపోయావు
నేను నీ అడుగు జాడలు వెతుక్కుంటూ
బయల్దేరాను, మధ్యలో దారి తప్పాను
నా కన్నీటి వానలో నీ అడుగు జాడలు చెదిరిపోయాయి
నేను ఎదురుచూసింది పువ్వులకోసమే కాని
ఈ కన్నీటి కోసం కాదే
నేను అడిగింది రంగుల ఇంద్ర ధనస్సులే కాని
ఈ నల్లటి  కన్నీటి మబ్బులు కాదే
ప్రేమ తుఫాను లాంటిదే
తీరాన్ని , సముద్రాన్ని ఒక్కటి చేసినట్లే చేసి
తీరాన్ని కసిగా లాగేసుకుంటుంది.
నువ్వు లేక తీరం లేని నేను
 కన్నీటి సముద్రాన్నయ్యాను

11, జూన్ 2013, మంగళవారం

జన సముద్రం

గట్టిగా చిలకండి జన సముద్రాన్ని
అవినీతి పర్వతం, అధికార సర్పం
మీదగ్గరే ఉన్నాయిగా,  అమృతం రాకపోయినా
మృతజీవులు పైకి తేలుతారు,
ఇరు వైపులా ఉంది రాక్షసులేగా,
ఈ మృత శవాల ఆయుష్షు తాగండి
బ్రతికున్నంత కాలం అధికార సర్పం
చెయ్యి జారదు,
లక్ష్మీ దేవి నేరుగా రాకపోయినా
ఇనుప ఖనిజాలు పైకి వస్తాయి,
కామధేనువు రాదని చింతపడకండీ
బొగ్గు గనులున్నాయి చూడండి
కల్పవృక్షాల్లాంటి ఐపిల్ లున్నాయి
పాపం నీలకంఠుడి గొంతు మండుంతుంది
హాలహాలం అనుకొని,  అల్కాహలం
త్రాగేశాడు మరి, మరి  కొంచెం
పొయ్యండి లయకారుడైనా
మత్తుగా పడుకునుంటాడు
బెల్టుషాపు శిఖరం మీద
విష్ణువు గురించి అసలు ఆలోచనే వద్దు
మన్ను తిన్న ఆదిశేషు మీద, ఆదమరచి
పడుకున్నాడు, 

స్థితి. లయలు లేవు
సృష్టి కర్తలు మీరే
విజృంభించి చిలకండి
ఎన్ని మృతశవాలు పైకి తేలితే
అంత ఆయుష్షు

10, జూన్ 2013, సోమవారం

అడివి

పచ్చటి అడవి
ఎర్రబారింది
ఖాకీ కవాతుతొనో
ఆలివ్ గ్రీన్ తుపాకితొనో
కారణం ఏదైనా
నిత్యం రణమే
అదవి లో బడబాగ్ని
రగులుతోంది
గిరి పుత్రుల పేర ఫొరాటానిదో
పారి శ్రామికవేత్తల ఆరాటానిదో
ఎవరిదైనా
అరణ్యరావణ కాష్టమే
హక్కుల చట్టాలు చేసి వారే
అవి చట్టుబండలు చేసేది వారే
గ్రామ సభలు పెట్టేది వీరే
ఆటవిక న్యాయం చెప్పేది వీరే
వారిద్దరి మధ్య ప్రతి రోజు 'వారే'
ఈ యుద్దం లో ఓడేది ప్రజల హక్కులే
గెలిచేది శవాల గుట్టలే

శవం నవ్వుతోంది

శవం ఇప్పుడో వార్త
వీధంతా మీడియా మైకులు
కాల్చేందుకు కట్టెలె లేవు.
చానెల్స్ లో మేధావుల చర్చా గోష్టి
పాడె కట్టటానికి పురికొస లేదు.
శ్మశానం లో కూడా ప్రత్యక్ష ప్రసారం
కాటి కాపరి కి ఇవ్వటానికి చిల్లర లేదు.
అకలి చావే కాని ఆఖరి చావు కాదు కదా,
అయినా ఎందుకీ హడావుడి
ఇదేమైనా కొత్త వింతా ?
మా బస్తిలో పాత కథే కదా !
పాపంపేపరోళ్ళు చితిమంటల వేడి లోనే
వార్తలు కాచుకుంటున్నారు
వాళ్ళు మాత్రం ఏమి చెస్తారు
ఆకలి ఎవరికైనా ఒకటే కదా
అవును, అన్నంతో పాటు
వార్తలూ తింటున్నరు

ప్రతి పూటా తాజా కూర, తాజా వార్త
మా బస్తీ లో మాత్రం ఎప్పుడు చద్ది కూరలే
వార్తలు లేవు,
ఇప్పుడు నవ్వుతోంది శవం
వార్తే మా బస్తీ కొచ్చినందుకు

వర్షపూలమాల

వర్షపూల మాలతో
నీకు స్వాగతం చెప్తున్నా ప్రియా
నువ్వు నాకు నాకన్నా దగ్గరగా రా
 ప్రేమ ఎప్పుడూ నాకు సంతోషమే
దాన్ని నీలో చూశాకా నాకు విస్మయమే
నువ్వు నాకు రెక్కలు తొడిగావు
అంబరానికి తీసుకెళ్ళావు, అక్కడ
ప్రతి రాత్రి చుక్కలు చెప్పే ఊసులు
వింటూ రాత్రంతా నీ వెన్నెల తాగుతున్నా
నువ్వు మేఘమై నన్ను తాకినప్పుడు
మెరుపునై నేను  వెలుగుతున్నా
ఒక్కటే చెప్పగలను ప్రియా
నీపై నేను అనురాగ వర్షాన్నై కురుస్తూనే ఉంటా
నా కళ్ళకి  కనురెప్పగా నీ రూపాన్నుంచుకున్నా
అందుకే నాకు లోకంలో పూలన్ని వికసిస్తూనే
కన్పిస్తున్నాయి, ఇంద్ర ధనస్సు కన్నా ఎక్కువ
రంగులద్దుకుంటూ
అసలు నా హృదయంలోనే పూలు
వికసిస్తున్నాయేమో, సృష్టిలో రంగులన్నీ
పులుముకుంటూ ,
నీ నవ్వుల చిరుజల్లులతో
ఆ పూలను తడిపి
ఆవర్షపూల మాలతో
నీకు స్వాగతం చెప్తున్నా ప్రియా

ఋతుగమనం

నా ఈ దారిలో  ఎవరో ఒకరు ఏదో ఒకరోజు నాకెదురువుతారు
నేనెప్పుడూ ఆశగా ఎదురు చూసే నా ప్రియనేస్తం రూపంలో
నీకు తెలుసా, నన్ను ఈ దారిలో ఆనందంగా నడిపించేది ఆ అశేనని
ఈ ప్రయాణంలో ఎన్నో గతి తప్పిన ఋతువులు చూశాను
చిగుళ్ళు తొడగని మావిళ్ళని, పాట పాడని కోయిలని చూశాను
కాని నా ఈ ఒంటరి ఋతువు ఏదో ఒక ఋతువుతో తప్పక కలుస్తుంది
నేను నిలుచొని ఎదురుచూస్తే ఎవ్వరూ రారని నాకు తెలుసు
అందుకే  ఎవరికోసమో తెలియకున్నా నేను యోజనాలు నడుస్తాను
శత సహస్ర యోజానాలైనా ఆనందంగా నడుస్తాను
నాకు నా మనసు మాట ఇచ్చింది,
నా ప్రియనేస్తంతో నన్నుతప్పక కలుపుతానని,
నేను తప్పక నమ్ముతాను నా మనస్సాక్షిని
అందుకే నేను నా నడక ముందుకు సాగిస్తూనే ఉన్నా
కాలిబాటనై
అనుకోకుండా ఏదో అలజడి, బహుశా
ఏదో ఋతు ఆగమన సవ్వడేమో, ఒక్కసారి
ఆ అగమనమైతే నిష్క్రమణం ఉండదు కదా
ఎందుకంటే నేను ఆ ఋతు గమనంతో పాటు
పవనమై సాగుతూనే ఉంటాను,
నాకు గాలి అయినా, బాట అయినా ఒకటే ,
ముందుకు సాగటమే కదా నాకు తెలిసింది

6, జూన్ 2013, గురువారం

ఒక్క క్షణం

నీ కళ్లలో నేను మెదలే క్షణం
నీ కౌగిలిలో నేను కదిలే క్షణం
నీ ఒడిలో నేను ఒదిగే క్షణం..............
ఆ ఒక్క క్షణం, ............
ఆ ఒక్క క్షణం ............. లో
నా కళ్లలో కన్పించే కాంతి చాలు ....
నాకు జీవితాంతం వెలుగునింపటానికి
నీ కళ్లలో కన్పించే ప్రేమా భావా వర్షం చాలు
నా జీవితాంతం ఆనంద వర్షంలో తడిచి ముద్దవటాని

నేను నీలో

కళ్ళ ముందు నీ రూపం కన్పించటం లేదు
అయినా కళ్లలో నీ లావణ్యం నన్ను మెప్పిస్తూనే ఉంది
నీ మేని స్పర్శ నా చేతికి అందటం లేదు
అయినా నీ శ్వాస నా చెంపకు తాకుతుంది
నీ కాలి అందెలరవళి నా చెవికి సోకటం లేదు
అయినా నీ పాదాల సవ్వడి నా గుండెల్లో వినిపిస్తుంది
నువ్వు పెట్టుకున్న మల్లెల వాసన నా నాసిక కు అందలేదు
అయినా నీ మేని వాసన నా మనసుకు తెలుస్తుంది
నీ వెక్కడున్నావా అని వెతుకుతుంటే తెలిసింది,
అసలు నేను లేనని, నేను నీలో ఉన్నానని

నా ప్రేమ

నీ తలపుల సుప్రభాతాలతో మేల్కొన్నది నా ప్రేమ
నీ అనురాగ వర్షాలతో మొలకెత్తింది నా ప్రేమ
నీ దరహాస చంద్రికలతో ఏరువాకయ్యింది నా ప్రేమ
నీ కుసుమ హస్తాలతో ఎదిగింది నా ప్రేమ
నీ వలపు విరుపులతో పెరిగింది నా ప్రేమ
నీవే కదా నా వసంతాల యామిని
నీవే కదా నా జీవిత అమని

నిశ్శబ్దం

మన ఇద్దరి మధ్య నిశ్శబ్దం,
చెవులు చిల్లులు పడేంత నిశ్శబ్దం,
పూజలు చేసే దేవుడి విగ్రహం చేసేంత నిశ్శబ్దం
మౌనంగా రోదించే కన్నీరు చెక్కిలి పై జారేంత నిశ్శబ్దం
గులాబీ కోసినప్పుడు తల్లి చెట్టు పడే వేదనంత నిశ్శబ్దం
జాలరివాడికి చేపపిల్లను కోల్పోయిన నది చేసే రోదనంత నిశ్శబ్దం
ఏఅలలు లేని నడి సంద్రంలో లంగరేసినంత నిశ్శబ్దం
అంతులేని ఈ నిశ్శబ్దనాదం ఒకరిదొకరికి చేరేదెలా అంటే నిశ్శబ్దమే కదా సమాధానం

మది దాటని భావాలు

కనులు దాటని ఊహలు
పెదవి దాటని పదాలు
మదిని దాటని భావాలు
అన్ని ఒక్కసారి బ్రద్దలై

...దీర్ఘ సుషుప్తావస్తను వదిలి
అవ్యక్త భావల బరువును మోయలేక
ఎన్నొ వత్సరాలు బిగిసిన ప్రేమరాహిత్యపు సంకెళ్ళు
తెంచుకుంటూ, నీవు దూరమైతే ఇక గమ్యమే లేదనే నిజాన్ని
తలచుకుంటూ, మనసంతా నువ్వే ఉన్నావని తనువంతా శక్తి
నింపుకుంటూ నిన్ను చేరాలని తాదాత్మ్యం చెందాలని,
అద్వైత సిద్దిని అనుభవించాలని వడివడిగా అడుగులేస్తున్నాయి
ఒక్క నిమిషం ఆగి చూడవా

5, జూన్ 2013, బుధవారం

మరుపు మర్చిపోయా

నా కన్ను చూడలేనంటోంది, నువ్వు
మిగిల్చి వెళ్ళిన కన్నీటి తడి అరేవరకు.
నా పెదవి మాటాడనంటోంది, నువ్వు
నేర్పించి వెళ్ళిన పాట మౌనం అయ్యేవరకు.
నా కాలు కదలనంటోంది, నువ్వు పరచి
వెళ్ళిన ముళ్ళ బాటను దాటేవరకు.
నా హృదయం పై నువ్వు చేసిన గాయం
ఇంకా నీ జ్ఞాపకాల రక్తాన్నే స్రవిస్తోంది.
నా జీవితం పై నువ్వు వదిలివెళ్ళిన
చీకటి మరక, వెలుగును కాలుస్తూ
ఆ  మసితో చీకటికి మరింత చిక్కటి
నలుపురంగద్దుతూనే ఉంది.
నాకు తెలుసు వీటన్నిటికీ మరుపు
ఒక్కటే చాలు అని, అన్ని నావి నాకు తిరిగొస్తాయని
కాని, నేను నిన్ను మర్చిపోవటాన్ని, మన పరిచయంతోనే
మర్చిపోయానే,

4, జూన్ 2013, మంగళవారం

తొలివాన

ఒరేయ్ తొలాన కురిసింది
ఈ పాలి ముగశిరకుముందే ,
ఇగ ముసిలెద్దు గూడా యవసాయానికి
తయారయ్యిద్ది.
మూలున్నములుగర్ర తీసి తలాప చుట్టి
సేను కాడికి పద, నెర్ర్లలు బోయిన నేల
కడుపారా నీళ్ళు తాగి దప్పిక తీరి
పదునుకొచ్చింది,
బండి కట్టు, మన కొట్టం లో ఉన్న
పేడకుప్పను పొలంలో వేసి
తొక్కిద్దాం, రేపే పంటేసినా
ఏపుగ పెరుగుద్ది
అదిగో మళ్ళీ మైలు లేచింది,
రేత్రి వరదగుడేసింది, ఇయ్యాల
కూడా వాన పడుద్ది, మనం యేసిన
ఎరువు జారకుండా గట్లన్నీ గట్టి చేద్దాం.
విత్తనాలకని పెట్టిన జొన్నలు తీసి
చూడు, పై చేలోకి పనికొత్తయి
పిల్లిపెసల సంగతి చూడు,
దక్షిణం చేనుకి, రాజమండ్రి
ఎళ్దాం పొగాకు నారుకి,
మెట్టచేలో ఎప్పుడదేగా
ఈ పాలి పోలేరమ్మ తిరనాల లో
పొంగలి పెట్టిన రోజు వాన చూసే
అనుకున్నారా, ఈ పాలి ఆయమ్మ
దయ మనమీదుందని .. ఆ యమ్మ
చల్లటి చూపుంటే చాలురా , మనకి
పతేడాది పండగేరా,
మనకెందుకురా
ఏ ఎదవ ఏ పార్టీలోకి పోతే
ఎన్నికలప్పుడు ఓటేద్దాం
ఇప్పుడు పంటేద్దాం
జనాలందరికి కూడు పెడదాం

3, జూన్ 2013, సోమవారం

చిరాయు ప్రాప్తిరస్తు

ప్రేమానుబంధాలో, కామానుబంధాలో,
క్షణానుబంధాలో, ధనానుబంధాలో

ఏదో బంధాలు, ఆ బంధాల మధ్య
బందీ అయ్యి బద్దకంగా బ్రతుకీడుస్తూ
భవిష్యత్తు గురించి కలల్లో , ఊహల్లో
తనను తాను ఊరించుకుంటూ
ఉడికించుకుంటూ, ఉపేక్షించుకుంటూ
ఆపేక్షించుకుంటూ,  సంసార కక్ష్య లో
పరిభ్రమిస్తూ, పరిక్రమిస్తూ , పరిశ్రమిస్తూ
విశ్రమిస్తూ , స్కలన జ్వలనాలతో
మరో తరానికి తలుపుతీస్తూ , తరగని మానవ
సంతతిని మరింత పెరగనిస్తూ, సంతతి సంపద కు
పరుగుదీస్తూ, జీవితమంతా వగరస్తూ, అగరస్తూ
గడ్డి కరుస్తూ, బ్రతుకీడుస్తున్న మనిషి జాతికి
చిరాయు ప్రాప్తిరస్తు

29, మే 2013, బుధవారం

ప్రేమవర్షం

ఈ రోజు  నా వర్షం నాకు తిరిగొచ్చింది
బహుకాల గ్రీష్మం తర్వాత
నాకు ముందుగానే తెలుసు
అందుకే సిద్దంగా ఉన్నాను
తడిసి ముద్దవటానికి, నీ ప్రేమ వాన లో
నేను ఎప్పటికి నమ్మలేను
నన్ను నీలా, నిన్ను నాలా
ప్రేమించగలవారు ఉన్నారని
అందుకే అనుమానపు గ్రీష్మాలను
అనురాగపు వర్షం తో ఆపేద్దాం
ఇక నుండి మనం కలిసి నడుద్దాం
పచ్చటి వర్షపు తోరణాల మధ్య
మెరుపు వెలుగుల తోడుతో , ఉరుము
మంగళ వాద్యాల సాక్షిగా
మనం కలిసి వలపు పంట పండిద్దాం
నీ నవ్వు తొలకరి లో, నా ప్రేమ ఏరువాక
సాగనిద్దాం , ఇద్దరి హృదయ క్షేత్రంలో
అనుమానపు బీజాలను ఏరివేస్తూ

ముద్దుమురిపాల ఎరువేస్తూ












13, మే 2013, సోమవారం

కలల బేహారి


 
నా జీవితమే
నీకు రాసి ఉన్నప్పుడు
అది నేను తెలుసుకోలేనప్పుడు
 
నా పక్కన ఉన్న నా ప్రేమని
గుర్తించలేనపుడు
వెతుకుతునే ఉన్నా
స్వర్గం కోసం.
గాలిస్తునే ఉన్నా
ఆనందం కోసం.
ఇలా శోధిస్తూనే ఉన్నా , ఒక అన్వేషి లా
సప్త సముద్రాల అవతల స్వప్న సుందరి కోసం,
కలల బేహారినై.
ఒక్కసారిగా నా కలల కేమయ్యిందో
బహుశా అది కేవలం కలే అని కళ్ళకు
అవగతమయ్యిందేమో ,
అప్పటికి
నీతో నేను ప్రేమలో
మునిగి లేను
అయినా నా హృదయం
స్పందిస్తూనే ఉంది
నీ పేరు సాక్షిగా,
అప్పుడు
మేల్కొని చూశా
నా భ్రమలను తొలిగిస్తూ
నా కళ్ళెదురుగా నవ్వుతూ
స్వర్గం, ఆనందం
రెండు చేతుల్లో ఉంచుకొని
ఆహ్వనిస్తూ నువ్వు