15, జనవరి 2016, శుక్రవారం

హ్యాంగ్ మ్యాన్

హ్యాంగ్ మ్యాన్ ! హ్యాంగ్ యువర్ బాడి !
ఏ కరెంట్ పోల్ కో, కాకపొతే కనపడే చెట్టుకో
ఎక్కడో ఒక చోట, కంఫర్ట్ ఈజ్ యువర్స్ బాస్ !!
ప్లేసు కాదు ముఖ్యం, చావటం  ముఖ్యం
రెండు నిమిషాలలో పోయే నీ ప్రాణానికి
రెండు నిమిషాల మౌనం, రెండు లక్షల పరిహారం
 మీ ఇంటి కథ ఇంతటితో సమాప్తం ,
మరో మరణం  మరో చోట ప్రారంభం .
సేమ్ స్టోరీ,  సేమ్ రిజల్ట్ , కాకపోతే కాస్టింగ్ చేంజ్
దట్స్ ఇట్ !! ఆల్ ఓవర్ !
అయినా నీమీద మెర్సీ చూపించటానికి
నువ్వేమైనా ఇండస్ట్రియలిస్ట్ వా !!
ఆఫ్ట్రాల్ ఫార్మర్ వి !! పొతే ఎంత ? ఉంటే ఎంత ?
ఎకనామికల్ గ్రోత్ లో నీ పాత్ర నధింగ్
అసలే రెసిషన్ తో సతమతవుతున్న సొసైటి.
నీ సూసైడ్ ప్రాబ్లమ్ కి సొల్యుషన్ చూసే టైమ్ ఎక్కడ ?
సూపర్ బజార్లో దొరికే రైస్ బ్యాగ్ ప్రైస్ పెరిగింది
అని బాధ పడే హై క్లాస్ కన్జ్యుమర్స్ కి మాత్రమే ఇక్కడ ప్లేస్ .
పండించే నీతో మాకేమి పనిలేదిక్కడ , కావాలంటే పంటలన్నీ
ఇంపోర్ట్ చేసుకోగల ఫారెక్స్ నిల్వలు పోగేసుకున్న దేశం
అయినా “మేకిన్ ఇండియా” అనే మెకనాస్ గోల్డ్ సినిమా ని
స్క్రీన్ మీద చూడాలంటే నీలాంటి రాలిపోవాల్సిన శలభాలు చాలా ఉన్నాయి .
సెన్సెక్స్  ఇండెక్స్ పెరగాలంటే మీ  సూసైడ్స్ కూడా పెరగాలి ,
అనేది సహజ పారిశ్రామిక సూత్రం
అందుకే మై డియర్ ఫార్మర్స్ !
పెస్టిసైడ్స్ పంటకు కాకుండా వంటికి వాడండి

సెజ్ ల కోసం స్పేస్ వదలండి . 

10, జనవరి 2016, ఆదివారం

జ్ఞాపకాలు

చాలా రోజుల తర్వాత సముద్రం దగ్గరకు వచ్చానేమో
కొద్దిగా తడిచిన ఇసుక అమ్మవడిలా వెచ్చగా ఉంది 
ప్రశాంతమైన చల్లటిగాలి నాన్న స్పర్శలా  మెల్లగా తాకింది
అటు వైపు చూద్దును కదా , ఊరి లాంటి సముద్రం లో
దూరంగా మెరుస్తున్న నావ మీద దీపం
ఒడ్డుకొస్తూ ఉప్పొంగుతుంది
అక్కడనుండి రెండు అడుగులు వేసి  
కొన్ని జ్ఞాపకాలపల్లీ కాయలను జేబులో నింపుకొని
ఒక్కొక్క కాయ వలుచుకుటూ వెళతాను
అదేమి విచిత్రమో,
గబగబా నాలుగు కాయలు తినేశాక
జేబు నిండుగా
ఉంచుకోలేని, పారవెయ్యలేని
తాలు కాయలు మిగిలిపొ తాయి
ఒక్కొక్కటి ఓపిగ్గా వలిచి చూసుకుంటా !
ఎక్కడైనా శక్తి నిచ్చే గింజ ఒకటైనా
దొరక్కపోతుందా అని !!
అక్కడక్కడా చేదుగింజలు కూడా మింగి
అన్నీ ఖాళీ అయ్యాక ఒక్కసారిగా
పెదవుల మీద చిరునవ్వు బెల్లమ్ముక్క
ఒకటి తియ్యగా అంటుకుంటుంది.

తృప్తిగా అక్కడనుండి తిరిగి బయల్దేరుతా

1, జనవరి 2016, శుక్రవారం

జస్టిస్

చూడోయ్ వెంకటేశం !
ఎందుకోయ్ ఈ అవేశం
ఏమీ జరగలేదిక్కడ
జరుగుతుంది అన్న ఆశాలేదు
నువ్వు నీ పాటికి ఒకనొక కల కనేసి
అది జరగలేదని బాధ పడిపోయి
న్యాయమో రామచంద్రా !!
అని అరిచేస్తే ఎలాగోయ్ !!
న్యాయం ఏమైనా మధురవాణి అనుకున్నావా
అప్పుడప్పుడు కరుణ చూపించటానికి
అది పచ్చి వెలయాలు రా నాయనా
ఇట్స్ ఎ ప్రాస్టిట్యూట్ దట్ సెడ్యూస్ అల్ కానిస్టిట్యూట్
చూడు మైడియర్ పూర్ క్రీచర్
కాసులున్నోడి కాపు కాయటం
ప్లాట్ ఫాం మీద పడుకున్నోళ్ళను
పూటకూళ్ళమ్మలను , పూట కూలోళ్లను
నిర్మూలించటమే లేటెస్ట్ సోషల్ రిఫార్మ్
సో లెట్స్ హిట్ & రన్
అండ్ హావ్ ఎ ఫన్
ఇప్పుడేదో అర్జంట్ గా సౌజన్యారావొచ్చేసి
జస్టిస్ చేసేస్తాడనుకోకు
ఇది రామప్పపంతులు గారి రాజ్యం రా అబ్బాయ్
ఈవెన్ గిరీశం కాంట్ డూ ఎనీ థింగ్
వాడు బుచ్చెమ్మతో బిజీ ముచ్చట్లలో ఉన్నాడు
ఇప్పుడు చట్టం లుబ్దావధానులు కొనుక్కున్న సుబ్బమ్మ
సో నోరుమూసుకొని సాయంత్రం బండెక్కి చదువుకోవటానికి
కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్ బుక్కు తీసుకొనొచ్చేయ్
అగ్రహారం పోయి మాంచి పాట ఒకటి పాడుకుందాం
"ఫుల్లు మూను లైటట ... జాసుమిన్ను వైటట ! “