11, మార్చి 2016, శుక్రవారం

డిసర్టడ్ విలేజ్

ఎర్రటి మట్టి రోడ్డు
దాన్ని నిలువుగా ఖండిస్తూ నల్లటి తార్రోడ్డు
దాన్నిండా కిక్కిరిసిన ఆధునికత
దూరంగా కనిపిస్తున్న ఫాక్టరీ గొట్టం విడుస్తున్న కుబుసం
అన్ ఫోకస్ లో కనిపించీ కనిపించని ఒక గ్రామం
దిస్ ఇస్ ద బిగినింగ్ షాట్
నవ్ లెట్స్ గో క్లోజ్ టూ దట్ విలేజ్

********
వట్టిపోయిన చెరువు, వడలి పొయిన కలువ పూలు
గడ్డి కోసం వెతుక్కుంటున్న పశువులు
నిలువెత్తు దుమ్ము పేరుకున్న శివాలయం
జూం ఇన్ ...
ఇక్కడుండే బిచ్చగాళ్ళు అండ్ బుడబుక్కల వాళ్ళు ఎక్కడ ?
దీజ్ కారెక్టర్స్ ఆర్ మిస్సింగ్ ,కాంట్ డూ ఏనీథింగ్
లెట్శ్ ప్లే ఏ పాథోస్ సాంగ్ ఇన్ బ్యాగ్రౌండ్
*******
కెమేరా కొంచెం రైట్ సైడ్ కి....
ఖాళితనంతో నిండిపోయిన వీధులు
గాలితో కలిసి తిరుగుతున్న నిశ్శబ్దం
ఊరంతా పరుచుకున్న ఒంటరితనం
పడిపొయిన మొండి గోడల్లా అక్కడక్కడా మనుషులు
ఫ్రేం లో ఒక్క నవ్వు ముఖమైనా కనిపించదే
హొ కెన్ ఫిల్ ద ఫ్రేం విత్ దిస్ డ్రైనెస్
*********
ఎండిన వేప చెట్టూ చుట్టూ రౌండ్ ట్రాలీ
ఫౌర్ గ్రొండ్ లో ఆకులు రాలిన కొమ్మలు
వెనక మసగ్గా చెమటలు కక్కుతున్న ఆకాశం
చూడటానికి వచ్చిన కొన్ని చీకిపోయిన పంచెలు
చొక్కాలు లేని నాలుగు లాగులు
మధ్యాహ్న భోజనం విదిల్చిన మెతుకులు
నో నీడ్ ఆఫ్ రీ రీకార్డింగ్ దిస్ ఎమోషన్ ఈజ్ ఎనఫ్
*********
పల్లెనుండి జనం ఫేడ్ అవుట్ అయ్యాకా
మిగిలే ఫ్రేం అంతా జస్ట్ ఎ సిల్హొట్ షాట్
చీకటిలో కరుగుతున్న నీడ తప్ప
ఏ వెలుగు కనిపించదు
ఇక మిగిలేదంతా
రాములోరి గుడి కూలిపోయాక
గట్టు మీద వట్టిగా పడున్న
వంటరి ఆంజనేయుడి బొమ్మే
అందుకే లెట్స్ ప్యాకప్
ఎక్కడైనా విలేజ్ సెట్ వేసుకుందాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి