4, డిసెంబర్ 2015, శుక్రవారం

బూచాడొచ్చాడు

ఇప్పుడిక్కడకు కొత్త బూచోడు వచ్చాడు
చూసి ఒకసారి భయపడు,
భయంతో పారిపో.
లేదంటే , వాడిప్పుడు
పాలపిట్టలను చూపించి
రాబందులని చెప్తాడు
నీ కళ్లకు భూతద్దాలు తొడిగి
వాటి రెక్కల్లో రక్తపు రంగు చూపిస్తాడు
పిట్టలు వాలుతున్నాయి అని
మన మధ్య ఉన్న పచ్చటి చెట్టు కొట్టేస్తాడు
నీకు నాకు మధ్య కొత్తగా  ముళ్ళ పొదలు నాటుతాడు
పరుగెత్తే లేడి ని చూపించి
కొమ్ములున్న  పులి అని చెప్తాడు
దాని అడుగులు చూపించి
నీ మృత్యు జాడలు అంటాడు
వన్యమృగాలుంటాయి
వనాలొద్దంటాడు
ఇప్పుడిక్కడ బీడు పెడతాడు
ఉరిమే మేఘాలను చూపించి
నీ మరణ ఘోష అంటాడు
కురిసే చినుకు చూపించి
ఆకాశం నీ మీదకు విసిరే వల అంటాడు
అసలు ఆకాశమే వద్దు
అని శూన్యంలోకి వెళ్దాం అంటాడు

బూచాడు చెయ్యి చాలా పెద్దది
చేత్తో నీ మనో క్షేత్రంలో
విషపు బీజాలు నాటుతాడు
 మొసలి కన్నీళ్లతో ఏపుగా పెంచుతాడు
నీ చూపుని నియంత్రిస్తాడు
చూపు సాగిన మేరా
కనుకట్టు కట్టిన దృశ్యాలను ప్రదర్సిస్తాడు
నీ మస్తిష్కాన్ని వాడు స్వాధీనం చేసుకుంటాడు
నీ ఆలోచన అంతా
వాడి ఊహానే చొప్పిస్తాడు
నీ నడక వాడు నిర్దేశిస్తాడు
నీ పరుగును
వాడి గమ్యం వైపు మళ్ళిస్తాడు
అందుకే నీ జీవితాన్ని బూచాడికిచ్చేసి
కొత్త మంత్రం జపిద్దాం 
ధైర్యొ  భక్షితి భక్షిత:
బూచొ రక్షితి రక్షిత:






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి