గాజా ప్రతి రోజు పాత రోజు లాగే ఉంటుంది ,
తేడా ఏముంటుంది ?
మహా అయితే తుపాకి మొనకున్న తలలు మారతాయి,
జీసస్ వదిలేసిన గొర్రెపిల్ల
కసాయోడికి దొరికాక
మరణాలు తప్ప నిర్ణయాలుంటాయా ?
మిస్సైల్స్ పై సిగ్నేచర్ చేసి మరణ శిక్ష వేశాక,
సీజ్ ఫైర్ కి
చాన్స్ ఎక్కడుంది ?
గద్దలు నెత్తురు తాగే దగ్గర
కపోతాలతో పనేముంది ?
గాలి స్తంభించిన నేల మీద
గాలి పటాలు ఎలా ఎగురుతాయి
జైల్లోనే జీవితాన్ని బంధిస్తే
ఇల్లేక్కడో ఎవరికి తెలుస్తుంది
గోడల మధ్య దేశాన్నుంచాక
గెలుపెవరికి దక్కుతుంది ?
బాధ పడకండి
అందరూ శవాలయ్యాక,
ద్వారాలు తెరుస్తారు కదా !
కాటి కాపరికి శవం వస్తేనే కదా పండగ !
ప్రపంచానికి కావాల్సింది పండగలు,
మనుషులకు కావాల్సింది మనశ్శాంతులు
అయినా మరణించాక మనశ్శాంతికి కరువేముంది
ఓ లార్డ్ ! లెట్ దెం డై ఇన్ పీస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి