7, మే 2013, మంగళవారం

వేశ్యావాటిక

ప్రతి సాయంత్రం పాతివ్రత్యం సరికొత్తగా మెలకెత్తే పవిత్ర క్షేత్రం
ప్రతి రాత్రి సతత శృంగార కాంతులు విరజిల్లు అగ్ని క్షేత్రం
ప్రతి గడపలో గడుసు కులాంగనలు కునారిల్లు ఖర్మక్షేత్రం
ప్రతి అంగన అంగడిలో అంగాంగం అమ్ముకొనే పుణ్యక్షేత్రం
ప్రతి కాంత తనువు నమ్ముకొని తనువునమ్ముకొనే ధర్మక్షేత్రం

ఆ క్షేత్రంలో మనకు కన్పించేది

గుండె ఎత్తులు తప్ప గుండె లోతులు కాదు
చీర తళుకులు తప్ప చీర చిరుగులు కాదు
నడుము వంపులు తప్ప కడుపు ఆకలి కాదు
పెదవుల తడి తప్ప కన్నీటి తడి కాదు
సెంటు వాసనలు తప్ప వంటి వాసనలు కాదు

అక్కడ ఎప్పుడూ

రాలుతూనే ఉంటాయి జాకెట్టు హుక్కులు , వారి హక్కులు
జారుతూనే ఉంటాయి కట్టు చీరలు, వంటి పరువాలు
కాలుతునే ఉంటాయి, సిగిరెట్లు, చితాభస్మాలు
పడుతూనే ఉంటాయి కత్తి పోట్లు ,పంటి గాట్లు
రోదిస్తునే ఉంటాయి వీధి దీపాలు, వీధి కుక్కలు

తెలుస్తూనే ఉంటాయి

నిరంతరం , తరతరాల నిశీది కి అలవాటు పడ్డ ఆర్తనాదాలు
వెలుగు చూడలేక , కలుగులో బ్రతుకుతున్న అబల బిడాలాలు
గుడారాలలో గుడ్డలిప్పి ఆడుతున్న కామపిశాచపు వికృత కేకలు
తన తనువును తానే అంగట్లో బేరమాడుకునే వింత వ్యాపారాలు
ఇది ప్రతినగరంలో , ప్రతి పట్టణంలో మనకు నిత్య దృశ్యాలు

 నిరంతరం జరుగుతుంటుంది

స్థలన స్కలితాల కై స్త్రీ స్తన్యగ్రందుల కోరి గ్రంధసాంగులు, సాగించే గ్రంధపటనం
మౌనంగా , కబళిస్తున్న రోగాలకు కంబళి కప్పి , అంబలి త్రాగించి మరీ స్వాగతం
మనసు మరణించిన మనుషులను ఊపిరితోనే ఖననం చేసే స్మశానం
భార రతి క్రీడలతో భారంగా శ్వాస తీసుకుంటున్న మాతృత్వపు రూపం

 మగువ శరీరంతో మృగ కోరిక తీర్చుకొనే కామ కరాళ నృత్య రూపకం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి